ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరంలో బడి పిల్లలకు పంపిణీ చేసే విద్యా కానుక కిట్‌పై ఉన్న సీఎం జగన్ పేరును అధికారులు తొలగించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ ఈ పథకం పేరును ‘విద్యా కానుక’గా మార్చింది. అలాగే జగన్ పేరు లేకుండా కేవలం ప్రభుత్వ లోగోతో బ్యాగులు, బెల్టులు, నోట్ పుస్తకాలు సిద్ధం చేశారు. ఫలితాల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియకుండా జగన్ పేరు పెట్టడం సరికాదని భావించిన ఈసీ... ఆయన పేరు తొలగించాలని ఆదేశించింది. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈసారి విద్యా కానుకపై జగన్ పేరు మాత్రం కనిపించదు. ఈసారి జగన్ పేరు తొలగించి కిట్లు తయారుచేశారు. కోడ్ అమల్లో ఉన్నందున వాటిని ఇంకా పాఠశాలలకు పంపలేదు. పోలింగ్ ముగిసినందున కిట్ల సరఫరాకు అనుమతి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఈసీని కోరనుంది. వచ్చేవారం నుంచి స్కూల్ కాంప్లెక్స్‌లు, పాఠశాలలకు విద్యా కానుక కిట్లు రవాణా చేస్తారు.