గ్రామీణ ప్రాంతాల్లో సకాలంలో వర్షాలు పడి పాడిపంటలతో పల్లెసీమలు కలకలలాడాలని కోరుకుంటూ అమ్మవార్లకు జాతర్లు చేస్తారు. ఇందులో భాగంగానే ఈ ఆదివారం పలు మండలాల్లో అమ్మవార్లకు ప్రత్యేకంగా జాతర్లు నిర్వహించారు. పీలేరు-తలపుల మార్గంలోని ఉలవల గంగమ్మ జాతర ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే జాతరలో ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమం ఆలయ పూజారి ప్రకాశ, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వెంకటరమణ నాయుడు భక్తుల సమక్షంలో నిర్వహించారు. అప్పటికే అమ్మవారికి బోనాలు సమర్పించుకునేందుకు తలపుల, మేళ్లచెరువు గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలి రావడంతో జాతర కోలాహలం మొదలైంది. అమ్మవారి దర్శనంతోపాటు జాతర సందర్భంగా మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.