తెలుగువాడి కీర్తి మరోసారి విశ్వవ్యాప్తమైంది. తెలుగు వ్యక్తి తోటకూర గోపీచంద్ విజయవంతంగా అంతరిక్ష యాత్రను పూర్తి చేశారు. రోదసీయాత్రను పూర్తి చేసిన రెండో భారతీయుడిగా గుర్తింపును అందుకున్నారు.. రాకేష్ శర్మ తొలిసారి రోదసీయాత్ర చేసిన భారతీయుడు. 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షయానం చేశారు. గోపీచంద్ న్యూషెపర్డ్-25 (ఎన్‌ఎస్-25) స్పేస్ క్రాఫ్ట్‌లో ఈ యాత్రను పూర్తి చేశారు. ఈ క్రాఫ్ట్‌ను అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించింది.
ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న తోటకూర గోపీచంద్‌కు భారత పాస్‌పోర్టు కూడా ఉంది. అందుకే రాకేష్ శర్మ తర్వాత అంతరిక్ష యానానికి వెళ్లిన రెండో భారతీయుడిగా గుర్తింపు దక్కింది. అంతేకాదు గోపీచంద్ టూరిస్ట్ హోదాలో అంతరిక్ష యాత్రను పూర్తి చేయగా.. భారతదేశం నుంచి తొలి స్పేస్ టూరిస్టుగా గుర్తింపు వచ్చింది. గోపిచంద్ విజయవాడలో పుట్టారు.. ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ సైన్స్‌లో బీఎస్సీ పూర్తి చేశారు. అయితే ఆయన పైలట్‌గానూ శిక్షణ పొందారు.. అత్యవసరమైన రోగుల్ని తరలించే ఎమర్జెన్సీ సేవల విభాగంలో విధులు నిర్వహించారు. గోపీచంద్‌కు గ్లైడర్లు, సీప్లేన్లతో పాటూ హాట్ ఎయిర్ బెలూన్లు కూడా నడిపిన అనుభవం ఉంది.. ఆయన అట్లాంటాలో ప్రిజర్వ్ లైఫ్ సంస్థకు కో ఫౌండర్‌గా ఉన్నారు.
కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల కూడా అంతరిక్ష యాత్రలు చేసినా వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. రాకేష్ శర్మ, గోపీచంద్ మాత్రం భారతీయులు. మరోవైపు ఈ అంతరిక్ష యానానికి గోపీచంద్‌తో పాటుగా ఫ్రాన్స్ బిజినెస్‌మెన్ సిల్వైన్ చిరోన్, వెంచర్ క్యాపిటలిస్ట్ మేసన్ ఏంజెల్, కరోల్ షాలర్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, అమెరికా ఎయిర్‌పోర్స్ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ కూడా వెళ్లారు.
వీరిలో ఎడ్ డ్వైట్ 1961లో అంతరిక్షయానానికి ఎంపికైన తొలి ఆఫ్రో అమెరికన్ వ్యోమగామి కావడం విశేషం. అయితే డ్వైట్‌కు కొన్ని కారణాలతో అంతరిక్ష యాత్రకు వెళ్లే ఛాన్స్ రాలేదు.. ఇప్పుడు ఆయన వయస్సు 90 ఏళ్లు. ఈ వయసులో ఆయన కోరిక నెరవేరిందని చెప్పాలి.. అలాగే అంతరిక్ష యానానికి వెళ్లిన పెద్ద వయస్సు వ్యక్తిగా కూడా గుర్తింపును పొందారు. గోపిచంద్ అండ్ టీమ్ వెళ్లిన న్యూషెపర్డ్ రాకెట్‌కు ఇది ఏడో మానవసహిత అంతరిక్షయాత్ర కావడం విశేషం. టెక్సాస్ నుంచి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పారాచూట్ల సాయంతో క్యాప్సూల్ నేలపైకి రాగా.. అంతకముందు ముందు రాకెట్ బూస్టర్ కూడా సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. తోటకూర గోపిచంద్‌కు అందరూ అభినందనలు తెలుపుతున్నారు.