పోలింగ్, ఆ తరువాతి రోజు ఎవరైతే చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడ్డారో వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌ను కోరింది. టీడీపీ బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు చేసింది. అన్ని అంశాలపై సమగ్ర విచారణ చేయాలని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, మల్లాది విష్ణు, శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి కోరారు. ఈ మేరకు ఈసీకి వినతిపత్రం అందజేశారు. మాచర్లలో పాల్వాయిగేట్, తుమ్మురుకోట, చింతపల్లి, ఒప్పిచర్ల, జెట్టి పాలెం, వెల్దుర్తి ప్రాంతాలలో జరిగిన అల్లర్లు, విధ్వంసకాండపై ఈసీకి ఆరోజే ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా ఉన్న పోలింగ్ బూత్ లలో పోలీస్ వారిని అసలు నియమించకుండా వైయస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్న పోలింగ్ బూత్ లలో డీఎస్పీ స్థాయి అధికారులను నియమించి ఓటర్లను ఓట్లు స్వేచ్ఛగా ఓటువేయకుండా పోలీసులతో భయభ్రాంతులకు గురిచేశారు. మాచర్ల వైయస్సార్ సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎప్పటికప్పుడు ఈ ఘటనలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా బేఖాతరు చేశారు. గొడవలు జరుగుతున్న ప్రాంతానికి పోలీసులను పంపలేదు. దానివల్ల హింసకు ప్రజ్వరిల్లింది. మాచర్ల హైపర్ సెన్సిటివ్ నియోజకవర్గంగా గుర్తించి సెంట్రల్ ఈసీ ఆదేశానుసారం 100 శాతం వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటుచేశారు. ఆ వీడియో ఫుటేజ్‌లను అన్నింటిని చూసి అనంతరం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా వీడియో ఫుటేజీల ఆధారంగా టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి, ఇతర అసాంఘిక శక్తులందరిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.