ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలపై.. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవో లక్ష్మీ షా కీలక ప్రకటన చేశారు. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయమేమీ లేదని తెలిపారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ మే 22వ తేదీ నుంచి స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో కీలక ప్రకటన చేశారు. గత రెండురోజులుగా.. ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకు సేవలు అందాయని తెలిపారు. మే 22వ తేదీ 6718 మంది, మే 23న 7118 మంది చికిత్స పొందారని లక్ష్మీ షా వివరించారు. గడిచిన ఏడాది కాలంలో రోజూ 5300 మంది వరకూ ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందినట్లు తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఏపీలోని పేదలకు మెరుగైన వైద్యం అందుతోందన్న ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో.. ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా పొరుగు రాష్ట్రాల్లోని
నెట్‌వర్క్ ఆస్పత్రుల్లోనూ వైద్యం కొనసాగుతున్నట్లు తెలిపారు. పెండింగ్ నిధులకు సంబంధించి ఆస్పత్రుల యాజమాన్యాలు సానుకూలంగా స్పందిస్తున్నాయని చెప్పుకొచ్చారు. మరోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3,566.22 కోట్లు ఆస్పత్రులకు చెల్లించామన్న లక్ష్మీ షా.. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ 366 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.
మరోవైపు పెండింగ్ బకాయిల విడుదలపై స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘంతో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలపై చర్చ జరగ్గా.. నిధుల విడుదలపై సీఎస్ హామీ ఇచ్చారు. అయితే హాస్పిటల్స్ అసోసిషియన్ మీటింగ్ అనంతరం కార్యచరణ ప్రకటించనున్నట్లు స్పెషాలిటీ ఆస్పత్రి సంఘం ప్రతినిధులు తెలిపారు.