హెలికాఫ్టర్‌లో కేదార్‌నాథ్ బయలుదేరిన ఆరుగురు భక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కేదార్‌నాథ్‌లోని కేదారేశ్వరుడిని దర్శించుకునేందుకు ఆరుగురు భక్తులు శుక్రవారం సిస్రీ నుంచి కేధార్‌నాథ్‌కు హెలికాఫ్టర్‌లో బయలుదేరారు. అయితే దాదాపు కేదార్‌నాథ్ సమీపంలోకి రాగానే.. హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో గాలిలో హెలికాఫ్టర్ వేగంగా చక్కర్లు కొట్టింది. ఆ క్రమంలో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించి.. హెలికాఫ్టర్‌ను బహిరంగ ప్రదేశంలో దింపేశాడు. కేదార్‌నాథ్‌లోని హెలిపాడ్‌కు దాదాపు 100 మీటర్ల దూరంలో హెలికాఫ్టర్‌ను దింపాల్సి వచ్చింది.ఈ ఘటనలో ఆరుగురు భక్తులతోపాటు పైలెట్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. కానీ ఈ ఘటనలో హెలికాఫ్టర్ వెనుక భాగం కొద్దిగా దెబ్బతింది. ఈ ఘటనపై డీజీసీఏకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనపై డీజీసీఏ విచారణ జరిపేందుకు సమాయత్తమైనట్లు సమాచారం. మే 10వ తేదీన కేదారనాథ్ దేవాలయం తలుపులు తెరిచారు. దీంతో కేదారేశ్వరుడిని దర్శించుకొనేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.