కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అమిత్ షాను ప్రధానిని చేయడం కోసం.. ఆ పార్టీలోని సీనియర్ నేతలు శివరాజ్ సింగ్, వసుందర రాజే, ఖతర్ సాహెబ్, డాక్టర్ రమణ్ సింగ్‌లను పక్కన పెట్టారని ఆరోపించారు.నేడో రేపో యూపీ ప్రస్తుత సీఎం యోగి ఆధిత్యనాథ్‌ను సైతం పక్కన పెడతారన్నారు. అందుకు సంబంధించిన ప్రచారం సైతం ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ మాట్లాడారు. 2019లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్బంగా కేజ్రీవాల్ గుర్తు చేశారు.బీజేపీలో 75 ఏళ్లు వచ్చినా.. ఆ వయస్సు దాటిన నాయకులంతా తప్పకుండా రిటైర్ కావాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారన్నారు. అందులో ఎటువంటి రాజీ లేదని అమిత్ షా చెప్పారన్నారు. కావాలంటే.. నాడు అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు.. ఇంటర్నెట్‌లో చెక్ చేసుకోవచ్చునంటూ కేజ్రీవాల్ సూచించారు. అయితే ఆ రూల్ ప్రకారమే బీజేపీలోని సీనియర్లు ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్ తదితరులంతా పార్టీ నుంచి తప్పుకున్నారన్నారు. ఇటువంటి నేపథ్యంలో బీజేపీలో ప్రస్తుతమున్న నాయకాగణం సైతం ఆ రూల్ ప్రకారం నడుచుకోవాల్సిందేనని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.