ఓ డ్రైవర్ నిర్లక్ష్యం వృద్ధుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కారును రివర్స్ తీస్తూ వృద్ధుడిపైకి ఎక్కించడమే కాకుండా.. గమనించకుండా మళ్లీ మళ్లీ అతనిపై నుంచి పోనిచ్చాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన తాలూకు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్అ వుతున్నాయి. యూపీ(UP)లోని ఝాన్సీకి చెందిన ఒక వ్యక్తి గల్లీలోనుంచి తన కారును రివర్స్ తీయడానికి ప్రయత్నించాడు. కారు వెనక ఉన్న రాజేంద్ర గుప్తా అనే 70 ఏళ్ల వృద్ధుడు దాని కింద పడ్డాడు. డ్రైవర్ వృద్ధుడిని గమనించకుండా.. కారును ముందుకు వెనక్కి రెండుసార్లు పోనించాడు. దీంతో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు.అతని అరుపులు విన్న స్థానికులు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని.. కారు కింద ఉన్న రాజేంద్రను బయటకి తీశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సదరు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.బాధితుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఝాన్సీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.