ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి పదిరోజులు దాటిపోయింది. మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తికాగా.. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే భారీగా నమోదైన పోలింగ్ శాతం.. రాజకీయ పార్టీలకు అంతు చిక్కకుండా ఉంది. ఏపీ ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఇదంతా పాజిటివ్ ఓట్లని అధికార వైసీపీ చెప్తోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే భారీగా పోలింగ్ జరిగిందని కూటమి నేతలు చెప్తున్నారు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ఈసారి భారీగా నమోదైంది. ఏపీ ఎన్నికల్లో 5 లక్షల 39 వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి.
ఏపీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. జిల్లాల నుంచి వచ్చిన తాజా లెక్కల ప్రకారం 5,39,189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. 25,283 ఓట్లతో నంద్యాల జిల్లా ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. 24, 918 ఓట్లతో కడప జిల్లా మూడోస్థానంలో ఉంది. అత్యల్పంగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మరోవైపు పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు అనుగుణంగా.. జిల్లాల్లో కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటుపై ప్రస్తుతం ఎన్నికల సంఘం అధికారులు చర్చలు జరుపుతున్నారు.
మరోవైపు ఏపీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల ఓట్లు ఎవరివైపు అనేది కీలకంగా మారింది. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా పోలైతే.. అది ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకతను నిదర్శనమని రాజకీయ వర్గాలు చెప్తుంటాయి. ఈ క్రమంలో ఉద్యోగులు ప్రభుత్వ వ్యతిరేకతతో ఓటేశారని టీడీపీ చెప్తుండగా.. వైసీపీ ప్రభుత్వ విధానాలు నచ్చి తమకు ఓటేశారని వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి.
అయితే ఏపీలో భారీగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వైసీపీకి వ్యతిరేకంగా పడ్డాయా లేదా.. లేదా వైసీపీకి అనుకూలంగా పడ్డాయా అనేది తెలియాల్సి ఉంది. జూన్ నాలుగో తేదీ వెల్లడయ్యే ఫలితాల్లో ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారు.. ఉద్యోగులు ఎటువైపు ఉన్నారనే దానిపై స్పష్టత రానుంది.