ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారిపోయింది.. కొద్దిరోజులుగా వర్షాలు పడగా.. మళ్లీ ఎండల తీవ్రత పెరగనుంది. సోమవారం నుంచి రాష్ట్రంలో ఎండ ప్రభావం చూపనుందని విపత్తుల నిర్హణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇవాళ 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. అలాగే మంగళవారం 165 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,149 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం3, విజయనగరం17, పార్వతీపురం మన్యం10, అల్లూరి సీతారామరాజు 2, అనకాపల్లి 2, కాకినాడ 6, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ 2, తూర్పుగోదావరి 17, పశ్చిమ గోదావరి 3, ఏలూరు 7, కృష్ణా 2, బాపట్ల కొల్లూరు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
ఇవాళ వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (200). ఆదివారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 40.9 డిగ్రీలు, పల్నాడు జిల్లా నరసరావుపేలో 40.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కనిగిరిలో 40.7 డిగ్రీలు, తిరుపతి జిల్లా నాయుడుపేటలో40.6 డిగ్రీలు, కాకినాడ జిల్లా తుని, కృష్ణా జిల్లా కంకిపాడులో 40.5 డిగ్రీలు, నెల్లూరు జిల్లా మనుబోలులో 40.4 డిగ్రీలు, ఏలూరు జిల్లా పెదవేగిలో 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో వేడి, ఉక్కపోత ఉంది. తుని, కాకినాడ, నరసాపురం, నందిగామ, మచిలీపట్నం, గన్నవరం, అమరావతి, బాపట్ల తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీలు పెరిగాయంటోంది వాతావరణశాక. అయితే రాష్ట్రంలో రానున్న రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు సోమవారం రాష్ట్రంలో ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ ఆదివారం ఉదయం తీవ్ర తుఫాన్‌గా బలపడింది. ఈ తుఫాన్ ఉత్తర దిశగా పయనించి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటినట్లు వాతావరణశాఖ తెలిపింది. సోమవారానికి ఇది తుఫాన్‌గా బలహీనపడుతుందంటున్నారు. ఆయా ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణశాఖ సూచిస్తోంది.