ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్యే పిన్నెల్లికి వరుస షాక్‌లు.. తాజాగా మరో రెండు కేసులు, హైకోర్టులో మరోసారి పిటిషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 27, 2024, 08:00 PM

పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి బ్రదర్స్‌ చిక్కుల్లోపడ్డారు. ఇప్పటికే పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం ఘటన, సీఐపై దాడి చేశారనే అంశాలపై రెండు కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసు కూడా నమోదైంది. పిన్నెల్లి బ్రదర్స్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని టీడీపీ కార్యకర్త, కండ్లకుంట పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంటుగా వ్యవహరించిన నోముల మాణిక్యరావు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి నలుగుర్ని నియమించారని ఆరోపించారు. తాను మాచర్ల వెళ్లే పరిస్థితి లేదని.. తనకు రక్షణ కల్పించాలని పోలీసుల్ని కోరారు.


ముందు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా స్వీకరించలేదు. దీంతో మాణిక్యరావు టీడీపీ నేతలతో కలిసి డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సానుకూలంగా స్పందించిన డీజీపీ బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారన్నారు నేతలు. ఆ తర్వాత మంగళగిరి పోలీసులు వీరి ఫిర్యాదుపై ఎట్టకేలకు స్పందించారు.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు అంగీకరించారు మంగళగిరి పోలీసులు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బాధితుడు మాణిక్యరావు తన లాయర్‌తో కలిసి ఫిర్యాదు అందజేశారు.


మరోవైపు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదుచేసిన మరో మూడు కేసులలో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు ఆదివారం అత్యవసర విచారణ జరిపింది. అయితే ఈ పిటిషన్లపై వాదనల కొనసాగింపునకు విచారణను సోమవారానికి వాయిదా పడింది. అలాగే సీఐ నారాయణస్వామిపై పిన్నెల్లి, ఆయన అనుచరులు దాడిచేసి గాయపరిచిన కేసు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ కేసు వివరాలను పరిశీలించాలని పీపీకి కోర్టు సూచన చసింది. పిన్నెల్లిపై రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌స్టేషన్‌లో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి హత్యాయత్నం చేశారని రెంటచింతల పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.


అలాగే పోలింగ్ మరుసటి రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడి వెళ్లిన సమయంలో మళ్లీ ఘర్షణ వాతావరణం కనిపిచింది. అయితే ఈ గొడవల్ని అడ్డుకోబోయిన సీఐ టీపీ నారాయణస్వామిపై దాడిచేసి గాయపరిచారనే ఫిర్యాదు పోలీసులకు అందింది. ఈ ఘటనలో పిన్నెల్లి, ఆయన తమ్ముడు, అనుచరులపై 307 తదితర సెక్షన్ల కింద కారంపూడి పీఎస్‌లో మరో కేసు నమోదైంది. మరోవైపు పాల్వాయిగేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లిని మరో మహిళ ప్రశ్నించగా.. ఎమ్మెల్యే తీవ్రంగా దుర్భాషలాడినట్లు ఆ మహిళ ఫిర్యాదుతో రెంటచింతల పోలీసులు మరో కేసు నమోదు చేశారు.


ఈ కేసుల్లో బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. వాదన సందర్భంగా పిన్నెల్లి హైకోర్టు విధించిన షరతుల్ని ఉల్లంఘించారని పీపీ కోర్టుకు తెలిపారు. ఆయన కదలికలపపై పోలీసులు నిఘా ఉంచలేకపోయారన్నారు.. మధ్యంతర బెయిల్ మంజూర్ చేయొద్దని కోరారు.. కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని కోరారు. ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉంది అని కూడా చెప్పారు. సీఐ తరఫున కూడా లాయర్ వాదించారు.. అయితే ఈ పిటిషన్లపై వాదనల కొనసాగింపునకు విచారణ సోమవారానికి వాయిదా పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com