ఎండ తీవ్రత, ఉక్కపోతతో రాష్ట్రం మంగళవారం ఉడికిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక ప్రాంతాల్లో వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది. వాయువ్య భారతం నుంచి పొడిగాలులు మధ్యభారతం మీదుగా రాష్ట్రంపైకి వీయగా, గాలుల్లో తేమ శాతం అతితక్కువగా ఉండడంతో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. పలుచోట్ల వడగాడ్పులు బెంబేలెత్తించింది. ఉదయం పది గంటల తరువాత ఆరుబయట ఉన్న వారంతా ఠారెత్తిపోయారు. సాయంత్రానికి కూడా వాతావరణం చల్లబడలేదు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా ఒకటి, రెండు డిగ్రీలు మాత్రమే ఎక్కువ నమోదైనా బయట వాతావరణం మాత్రం అంతకు మించి వేడిగా ఉంది. మరో నాలుగైదు రోజుల వరకు కోస్తా, రాయలసీమల్లో ఎండలు, వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుండగా మంగళవారం మాల్దీవులు, దక్షిణ అరేబియా సముద్రంలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న మూడు, నాలుగు రోజుల్లో కేరళ, అరేబియా, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు, ఈశాన్య భారతంలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి. వాయువ్య, ఉత్తర, మధ్య, తూర్పుభారతం, దానికి ఆనుకుని ఏపీ, తెలంగాణలో ఎండలు కొనసాగాయి. వాయువ్య భారతం, ఉత్తరాదిలో అనేకచోట్ల తీవ్ర వడగాడ్పులు వీచాయి. మంగళవారం రాజస్థాన్‌లోని చురులో రికార్డు స్థాయిలో 50.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.