ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా.. నిజం మరిచి నిదురపోకుమా అన్నాడో సినీకవి. ఆ ఊరి జనం ఈ మాటను అక్షరాలా పాటించారు. తమ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు వస్తారని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసి.. ఎదురుచూసి విసిగిపోయారు. ఎంతమంది అధికారులకు మొరపెట్టుకున్నా తమ గోడు ఆలకించరని.. తమ గోస తీరదని నిశ్చయించుకున్నారు. అందుకని తమ సమస్య పరిష్కారం కోసం తామే నడుంకట్టారు. ఊరంతా ఏకమై.. చందాలు పోగేసుకుని మరీ తమ సమస్యకు ఓ పరిష్కార మార్గా్న్ని వెతుక్కుంటున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలోని భీమవరం పంచాయితీలోని గుమ్మడి గండువ గ్రామాన్ని తాగునీటి కొరత వేధిస్తోంది. ఎండాకాలం వస్తే చాలు గొంతు తడుపుకునేందుకు ఆ ఊరిజనం నానా అగచాట్లు పడుతుంటారు. దీంతో తమ ఊరికి తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలతో పాటుగా అధికారులకు కూడా మొరపెట్టుకున్నారు. కానీ వారి బాధలు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీంతో తమ సమస్య పరిష్కారం కోసం ఆ ఊరిజనం నడుం బిగించారు.కొండల్లో ఉన్న ఊట నుంచి ఊరిలోకి పైప్ లైన్ నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆ తాగునీటి పైప్ లైన్ కోసం గుమ్మడి గండువ గ్రామ ప్రజలు ఇంటింటా చందాలు వేసుకున్నారు. ఆ ఊర్లో మొత్తం 74 ఇళ్ళు ఉన్నాయి. దీంతో ఇంటికి రూ. 3 వేలు చొప్పున డబ్బులు పోగు చేసుకుని..పైప్ లైన్ నిర్మాణానికి పూనుకున్నారు, రెండున్నర కిలోమీటర్ల మేర కూడా పైప్ లైన్ వేసుకున్నారు. అయితే ఇంకా కిలోమీటర్ నిర్మాణం జరగాల్సి ఉంది. అయితే చందాలు వేసుకుని పోగు చేసుకున్న నిధులు పూర్తికావటంతో.. నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. పైప్‌లైన్ నిర్మాణం, వాటర్ ట్యాంక్ నిర్మాణానికి పోగేసిన డబ్బులు సరిపోవడం లేదని.. తమకు సాయం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం తమకు అండగా నిలవాలని కోరుతున్నారు.