ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ పూర్తైన వెంటనే వైఎస్ జగన్ కుటుంబసమేతంగా యూరోప్ పర్యటనకు వెళ్లారు. సుమారుగా 15 రోజులపాటు జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. అయితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మళ్లీ స్వదేశానికి రానున్నారు. విదేశీ పర్యటనను పూర్తిచేసుకుని.. శనివారం ఉదయానికి విజయవాడ చేరుకుంటారు. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టులో జగన్ దిగనున్నారు.
మరోవైపు లండన్ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్‌కు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో న్యూలుక్‌లో వైఎస్ జగన్ కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. వైఎస్ జగన్ ఎక్కువగా తెల్లచొక్కాతోనే కనిపిస్తూ ఉంటారు. అయితే లండన్ పర్యటనలో మాత్రం జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్, షూస్ వేసుకుని వైఎస్ జగన్ న్యూ లుక్‌లో కనిపించారు. దీంతో ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక మిస్టర్ కూల్ అంటూ.. సూపర్ అంటూ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు షేర్ చేస్తున్నాయి.
మరోవైపు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత వైసీపీ నేతలతో జగన్ భేటీకానున్నారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై పార్టీ కీలక నేతలతో భేటీకానున్నట్లు తెలిసింది. మే 13వ తేదీ ఎన్నికల పోలింగ్ ముగియగా.. మే 17వ తేదీ వైఎస్ జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. అయితే ఈ మధ్యకాలంలో అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో ఈసీ మార్గదర్శకాలను వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై రేపు సాయంత్రం ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తిరిగివస్తే.. తీర్పు తర్వాత ఏం చేయాలనేదానిపై వైసీపీ సమాలోచనలు జరిపే అవకాశం ఉంది.