రేణిగుంట మండలం మామండూరులోని మామిడితోపుపై రెండు ఏనుగులు పడి బీభత్సం సృష్టించాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. రెండ్రోజుల కిందట ఏనుగుల గుంపు మామిడితోపు సమీపంలో వచ్చి వెళ్లింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం రెండు పెద్ద ఏనుగులు మామిడితోపులోకి ప్రవేశించాయి. చెట్లను విరిచేసి, కాయలు రాల్చేస్తూ బీభత్సం సృష్టించాయి. గ్రామస్తులంతా గుమికూడి పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ.. అతికష్టంపై వాటిని అడవుల్లోకి తరిమేశారు. కాగా, గత నెల 8వ తేదీన కూడా ఏనుగుల గుంపు దాదాపు 60 ఎకరాల్లోని మామిడి చెట్లను ధ్వంసం చేసిందని, ఇప్పటి వరకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా పూడిపోయిన కందకాలను బాగుచేసి, ఏనుగుల బారి నుంచి రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు.