ఏలూరు జూట్‌మిల్లు వద్ద ఫ్లైఓవర్ సుమారు 40 ఏళ్ల క్రితం బ్రిడ్జి నిర్మించారు. జనాభా పెరుగుదలతో పాటు వాహనాల సంఖ్య అధికంగా పెరిగింది. ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనాలు, బస్సులు ఈ బ్రిడ్జిపై రాకపోకలు సాగిస్తాయి. వన్‌టౌన్, టూటౌన్ వచ్చేందుకు ఇదే ప్రధాన మార్గం. బ్రిడ్జి నిర్మాణం పటుత్వం కోల్పోతుంది. శ్లాబు అనేకచోట్ల పూర్తిగా పెచ్చులు రాలిపోతోంది. పిల్లర్లకు కూడా పగుళ్లు ఏర్పడి, ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి. ఆర్‌అండ్‌బి అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో దీని పరిస్థితి ఇలా తయారైంది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే లైన్‌పై బ్రిడ్జిని నిర్మిం చారు. రోజురోజుకు వాహనాల రాకపోకల సంఖ్య విపరీతంగా పెరగడంతో బ్రిడ్జి క్రమేపి శిథిలావస్థకు చేరుతోంది. పగుళ్లతో పాటు స్తంభాలపై మొక్కలు ఏపుగా పెరగడం, శ్లాబు కింద సిమెంట్ బిళ్లలుగా ఊడిపోవడం భారీ వాహనాల రాకపోకలతో బ్రిడ్జి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. బ్రిడ్జిపై నిత్యం వేలాది వాహనాలు వచ్చిపోతుంటాయి. బ్రిడ్జికి అడుగుభాగాన అనేకచోట్ల పగుళ్లు ఏర్పడటంతో పాటు మర్రిచెట్లు మొలిచి ఊడలు బ్రిడ్జిలోపల నుంచి వ్యాపించి ఉన్నాయి. వీటివల్ల బ్రిడ్జికి ఎప్ప టికైనా ప్రమాదమే. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.