సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఒంగోలు జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ దినే్‌షకుమార్ తెలిపారు. ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య, సీసీ కెమెరాల నిఘా నీడలో ఈనెల 4న కౌంటింగ్ జరుగుతుందని చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్లు, ఒంగోలు పార్లమెంట్‌కు 40 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈవీఎం కౌంటింగ్ కోసం ప్రతి టేబుల్ వద్ద ఒక సూపర్‌వైజర్, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ అధికారులు, ఒక మైక్రో అబ్జర్వర్, ఒక అసిస్టెంట్, ఒక ఏఆర్వోను నియమించినట్లు చెప్పారు. ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కేంద్రాలకు వెళ్లేందుకు సిబ్బందికి, ఏజెంట్లకు ప్రత్యేక మార్గాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 2,400 మంది ఏజెంట్లు, 1,500 మంది సిబ్బంది, వెయ్యి మంది పోలీసులు ఉంటారని తెలిపారు. కౌంటింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ పద్ధతిలో కేటాయించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు తమ దరఖాస్తులను శనివారం లోపు అందించాలని కోరారు. కౌంటింగ్ సమయంలో అవాంతరాలు కల్పించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అభ్యర్థులు కూడా కేవలం మూడుసార్లు మాత్రమే కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లి వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో 200 సీసీ కెమెరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా జూన్ 3 నుంచి 5వతేదీ వరకు 144 సెక్షన్ అమలు చేస్తూ కలెక్టర్ దినే్‌షకుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.