గుంటూరులో విజిలెన్స్ అధికారులు సరికొత్త రూట్‌లో రంగంలోకి దిగారు. విత్తనాలు విక్రయించే షాపుల్లో మారు వేషాల్లో వెల్లి తనిఖీలు చేపట్టారు. నగరంలోని శుక్రవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా షాపుల్లో దాడులు చేశారు. రాజాగారితోటలో ఉన్న షాపుల్లో అక్రమంగా పత్తి, మిర్చి విత్తనాలు నిల్వచేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ సమాచారం తెలియడంతో విజిలెన్స్ ఎస్పీ ఈశ్వరరావు ఆదేశాలతో స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది.
సీఐతో పాటుగా వ్యవసాయశాఖ అధికారి, ఏవోలు.. రాజాగారి తోటలో ఉన్న ఓ షాపుకు హెడ్ కానిస్టేబుల్‌ను రైతు వేషంలో పంపారు. మూడు రకాల పత్తి, మిర్చి విత్తనాల పేర్లు చెప్పి కావాలని అడిగాడు.. షాపు నిర్వాహకులు ఆ విత్తనాలు స్టాక్ లేదన్నాడు. ఆ వెంటనే మిగిలిన అధికారులు సిబ్బందితో ఆ షాపులో తనిఖీలు చేపట్టారు. దుకాణంలో స్టాక్ రిజిస్టర్ పరిశీలించగా.. అక్కడ స్టాక్‌లేదని రాసి ఉంది. అంతేకాదు విత్తనాల షాపునకు సంబంధించి గోడౌన్‌లో కూడా తనిఖీలు చేపట్టారు.
ఆ గోడౌన్‌లో పలు రకాల విత్తనాలు 18 ప్యాకెట్లు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానే షాపు నిర్వాహకుడు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న విత్తనాలను నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నట్లు తేల్చారు అధికారులు. రూ.15,552 విలువ గల విత్తనాలను జప్తు చేసిన అధికారులు.. 6ఏ కేసు నమోదు చేశారు. మరో రెండు షాపుల్లో కూడా తనిఖీలు చేయగా.. సరైన పత్రాలు లేకుండా విక్రయిస్తున్న రూ.2 లక్షలు విలువ చేసే విత్తనాలను అమ్మకుండా అడ్డుకున్నారు. ఆ షాపులవారికి కూడా నోటీసులు జారీ చేశారు అధికారులు.