ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కౌంటింగ్‌కు ముందు వైసీపీకి బిగ్ షాక్.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 04:40 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ వేళ వైఎస్సార్‌సీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల విషయంలో.. తాము జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్వర్వులను వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.. ఇవాళ విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్ , జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం.. ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.


కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి.. మే 30న కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టల్‌ బ్యాలెట్ల ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ‘ఫాం-13ఏ’ పై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉంటే చాలు.. ఆయన పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటవుతాయని ఈసీ స్పష్టత ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల్ని వైఎస్సార్‌సీపీ ఏపీ హైకోర్టులో సవాల్ చేసింది.. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. శనివారం కీలక తీర్పును ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక.. ఈసీ ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఒకవేళ పిటిషనర్ (వైఎస్సార్‌సీపీ)కి ఏదైనా అభ్యంతరం ఉంటే వాటికి ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని స్వేచ్ఛనిస్తూ జస్టిస్‌ మండవ కిరణ్మయి, జస్టిస్‌ న్యాపతి విజయ్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పును వెల్లడించింది.


ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును వైఎస్సార్‌సీపీ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.. ఆదివారం ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. వైఎస్సార్‌సీపీ ఎస్‌ఎల్‌పీ దాఖల చేయగా.. విశాఖ తూర్పు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో ఏదైనా ఉత్తర్వులు జారీచేసే ముందు సుప్రీం కోర్టు తమ వాదనల్ని కూడా వినాలని కోరారు. అయితే కోర్టు వైఎస్సార్‌సీపీ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో ఎన్నికల కౌంటింగ్‌కు ముందు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బ తగిలింది.


మరోవైపు తిరుపతి జిల్లా చంద్రగిరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురయ్యింది. నియోజకవర్గంలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.. రీపోలింగ్ కు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈసీ విధుల్లో జోక్యం చేసుకోలేమని.. ఆ పిటిషన్‌‌ను తోసిపుచ్చింది.


ఇటీవల చంద్రగిరిలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఫామ్ 17సీ, అసలు ఓట్ల స్క్రూటినీ, రీపోలింగ్ కోరుతూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కానీ సుప్రీంకోర్టు ఇందుకు నిరాకరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa