కోట్ల మందికి సంక్షేమం అందించినా.. గతంలో జరగనంత మంచి చేసినా.. అన్ని వర్గాల మంచి కోసం ప్రతీ అడుగు వేసిన తమ ప్రభుత్వానికి ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించనేలేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆ ఆప్యాయత ఏమైందో అర్థం కావడం లేదన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మంగళవారం సాయంత్రం తాడేపల్లిలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ....... మహిళా సాధికారత అంటే ఇది అని ప్రపంచానికి సాటి చెప్పగలిగాం. సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి చేసిన తర్వాత ఆ అభిమానం ఏమయిందో, ఆ ఆప్యాయత ఏమయిందో తెలియదు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని అనొచ్చు కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేనైతే చేయగలిగిందేమీ లేదు. ప్రజలు తీర్పు.. తీసుకుంటాం. కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా కచ్చితంగా ఉంటాం. వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ కింద ఈ పార్టీ తాను చేయాల్సిన పని తప్పకుండా చేస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ పేదవాడికి తోడుగా ఉంటూ గళం విప్పుతుంది. పేదవాడికి అండగా నిలుస్తుంది అని భరోసా ఇచ్చారు.