ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని పెద్ద గాంధీబొమ్మ సెంటర్‌లో వైయస్ఆర్‌సీపీకి చెందిన 30వ వార్డు కౌన్సిలర్ నడకుదురు గిరీష్‌పై టీడీపీ కార్యకర్త నూకల సాయి అరుణ్ కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. దీంతో గిరీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. నూకల సాయికిరణ్ (చింటూ), నూకల సాయి అరుణ్‌లకు.. కౌన్సిలర్ గిరీష్‌కు మధ్య గతం నుంచి గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ విజయం సాధించినప్పటి నుంచి చింటూ, అరుణ్‌లు గిరీష్‌ను కవ్విస్తూ వస్తున్నారు. పశువుల ఆసుపత్రి వద్ద ఉన్న గిరీష్ చికెన్ సెంటర్ వద్దకు సైతం వచ్చి కవ్వింపు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 10.30 గంటలకు మిత్రుడు సుధీర్‌కుమార్ బండిపై చింటూ వెళ్తుండగా.. పెద్ద గాంధీ బొమ్మ సెంటర్‌లో గిరీష్ వారిని ఆపాడు. ఎందుకు కవ్విస్తున్నారంటూ చింటూను నిలదీశాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగి తోపులాట వరకు వెళ్లింది. ఈ క్రమంలో గిరీష్ చింటూపై కత్తితో దాడి చేశాడు. దీంతో అదే సెంటర్‌లో ట్రాఫిక్ డ్యూటీ నిర్వహిస్తున్న హోంగార్డు చంద్రశేఖర్, సుధీర్, మరికొందరు నిలువరించి గిరీష్ వద్ద ఉన్న కత్తిని లాక్కున్నారు. తన అన్న చింటూపై దాడి చేస్తున్నారన్న విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్న చింటూ తమ్ముడు నూకల సాయి అరుణ్ కత్తి తీసుకుని గిరీష్‌పై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో గిరీష్ చావుబతుకుల మధ్య అక్కడి నుంచి పారిపోతున్నా వెంబడించారు. అక్కడి నుంచి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని సీఐ ఎంవీఎస్‌ఎన్ మూర్తికి తెలుపగా వెంటనే చికిత్స నిమిత్తం అతన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చింటూను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నిందితులు నూకల సాయి అరుణ్, మూడు సుధీర్‌కుమార్‌లను అరెస్టు చేశామని, వారిపై 307 కేసు నమోదు చేశామని ఏలూరు జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి తెలిపారు. ఘటన ప్రాంతాన్ని గురువారం సాయంత్రం ఆమె పరిశీలించారు. అనంతరం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. తమ హోంగార్డు చంద్రశేఖర్ ఎంతో ధైర్యంగా గిరీష్ చేతిలోని కత్తిని లాక్కొన్నాడని, దీంతో మరిన్ని గాయాలు కాకుండా ఆపగలిగామన్నారు. ఈ సందర్భంగా హోంగార్డుకు ఎస్పీ రివార్డు అందజేశారు. ఎవరైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు. వారిపై రౌడీషీట్‌లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. అంతకు ముందు నూజివీడు డీఎస్పీ జీ లక్ష్మయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు.