ఐదేళ్లుగా వైసీపీ నాయకులు చేసిన అక్రమాలపై నిగ్గు తేల్చుతామని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన జీవీ ఆంజనేయులును కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందనలతో ముచెత్తారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి జీవీ నివాసానికి భారీగా తరలివచ్చి అభిమానులతో నివాస గృహం సందడిగా మారింది. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ జగన్ ఐదేళ్లపాటు వ్యవస్ధలను సర్వనాశనం చేశారని వాటిని చక్కదిద్దటం మా ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అన్నారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ చెప్పినట్లు తప్పుచేసిన అధికారులను వదిలి పెట్టేది లేదని, తప్పు చెయ్యనివాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రత్యేకించి లోకేశ్ యువగళం పాదయాత్రలో ప్రస్తావించిన రెడ్ బుక్‌లో ఉన్న వారందరూ చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దారితప్పిన అధికారులందరికు తమ ప్రభుత్వంలోకి నోఎంట్రీ అన్నారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి హైదరాబాద్ నివాసంలో సోదాలు, కూటమి ప్రభుత్వం ఎలా ఉండబోతుందో అనడానికి ఇది టీజర్ మాత్రమేనని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెబుతున్నట్లు ఐదేళ్లుగా వైసీపీచేసిన ల్యాండ్, శాండ్, మైనింగ్, లిక్కర్ మాఫియాల మొత్తం నిగ్గు తేల్చి తీరుతామన్నారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, లోకేశ్ కూడా మొదటి నుంచి అదే చెబుతున్నారని జీవీ గుర్తుచేశారు. ఐదేళ్ల అరాచకాలకు సంబంధించి ఫైళ్లు మాయంచేసి, ఆధారాలు ధ్వంసంచేసి సాక్ష్యాలు చెరిపేసి తప్పించుకుని పోదామంటే కుదరదన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంతోనే ప్రజా రాజధాని అమరావతికి మళ్లీ ప్రాణ ప్రతిష్ట జరగనున్నదని తెలిపారు. ఆంధ్రుల కలల రాజధాని ప్రపంచస్థాయి నగరంగా, అవకాశాల స్వర్గంగా, సర్వాంగ సుందరంగా అమరావతి రూపుదిద్దుకోబోతుందన్న మాటే ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు. పోలవరం పూర్తి, నదుల అనుసంధానంతో రాష్ట్రమంతా జలసవ్వడులు కూడా త్వరలోనే ఖాయంగా చూస్తామన్నారు. వరికపూడిశెల, పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేసుకునే సదవకాశం వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజలు అందించిన అద్భుత విజయంతో కేంద్రంలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కీలకపాత్ర పోషించే అవకాశం రావడం ఈ కలల సాకారానికి ఉపకరించనుందన్నారు. కేంద్రంలో మరోసారి చంద్రబాబు కింగ్ మేకర్ పాత్రను రాషా్ట్రభివృద్ధికి వినియోగించుకుంటామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను ప్రజాపాలన వేదికలుగా మార్చుతామని తెలిపారు.