ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా చెత్త పన్నుకు చెక్ చెప్తూ పుర ప్రజలకు శుభవార్తను అందించింది. తాము అఽధికారంలోకి వస్తే చెత్త పన్ను ఎత్తివేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకు సిద్ధమయ్యారు. కూటమి విజయం సాధించగానే చెత్త పన్ను వసూలు నిలిపివేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక చెత్త పన్ను రద్దు చేస్తే జీవో విడుదల చేయనుంది. వైసీపీ ప్రభుత్వం పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని మున్సిపల్ ప్రజల నుంచి చెత్త పన్ను రూ.9.48 కోట్లు వరకు వసూలు చేసింది. ఆస్తి పనుల కంటే ఎక్కువగా ప్రజల ముక్కు పిండి మరీ చెత్త పన్ను వసూలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కింది. క్లాప్ పేరుతో నూతన పారిశుధ్య విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు వైసీపీ ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. దీనిని అమలులో చతికిల పడింది. క్లాప్ అట్టర్‌ప్లాప్ అయింది. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేయాల్సిన వైసీపీ ప్రభుత్వం ఈ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంది. వలంటీర్లకు లక్ష్యాలు విధించి మరీ చెత్త పన్ను వసూలు చేయించారు. దీంతో వలంటీర్లు లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందించే సమయంలో చెత్త పన్ను మినహాయించుకున్న సంఘటనలున్నాయి.