శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన శ్రీశైలం అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన బుడ్డా రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆదివారం ఆత్మకూరులో విజయోత్సవ సభను నిర్వహించారు. ముందుగా నంద్యాల టర్నింగ్ నుంచి గౌడ్‌సెంటర్ వరకు రోడ్‌షో నిర్వహించారు. అక్కడ దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అలాగే టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో తనను గెలిపించిన నాయకులు, కార్యకర్తల కష్టాన్ని ఎప్పటికీ మరువనని అన్నారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా అనేక ప్రలోభాలకు గురిచేసినప్పటికీ అభిమానంతో తనపై ఆదరణ చూపించిన వారందరినీ గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు. ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఐదేళ్ల దుర్మార్గ పాలనతో అడ్రస్ గల్లంతైందని అన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎంతో బాధ్యతగా పాలన అందిస్తానని చెప్పారు. కార్యకర్తలు కూడా ప్రజలతో మరింత చేరువై ఎప్పటికప్పుడు వారి సమస్యలపై స్పందించాలని సూచించారు. తనకు మెజార్టీ వచ్చినా, రాకపోయినా కార్యకర్తలందరినీ సమానంగా చూస్తానని తెలిపారు. అదేవిధంగా తనకు మెజార్టీ రానీ బూత్‌ల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషిచేస్తానన్నారు. ప్రత్యేకించి యువతకు ఉద్యోగ కల్పనకు పాటుపడుతానని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి రైతు పొలానికి సాగునీరందించేలా చొరవ తీసుకుంటానని వివరించారు. ఇకపోతే ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమాలతోనే పాలన సాగించారని, అందుకే ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్నివిఽధాలుగా నాశనం చేశారని ఈ పరిస్థితుల్లో మోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని శ్రీశైలం నియోజకవర్గంలో అత్యుత్సాహం చూపిన వైసీపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వర్థన్ బ్యాంకు పేరిట మాజీ ఎమ్మెల్యే శిల్పా రూ.30 కోట్లను కొల్లకొట్టారని, బాధితులు ముందుకొస్తే ఆయన్ని జైల్లో వేయిస్తానని స్పష్టం చేశారు. 50వేల మెజార్టీ రాకపోతే రాజకీయ సన్యానం చేస్తానని ప్రగల్భాలు పలికిన ఎన్నికల్లో ఓడిపోగానే ఊరు విడిచి వెళ్లారని, ఇలాంటి నాయకులను ఇక్కడి ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కంచర్ల గోవిందరెడ్డి, టీడీపీ సమన్వయకర్త బన్నూరు రామలింగారెడ్డి, టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు శివప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా, మహానంది ఎంపీపీ యశస్విని, జనసేన నాయకులు అశోక్, శ్రీరాములు, బీజేపీ నాయకులు వెంకటసుబ్బారెడ్డి, సుదర్శన్ తదితరులు ఉన్నారు.