కాలుష్య కోరల నుంచి పంట పొలాలను కాపాడాలని డీ.హీరేహాళ్ సీపీఐ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రతినిత్యం ఐరనఓర్ పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యంతో ఆ పరిశ్రమల చుట్టు పక్కల సుమారు రెండు కిలోమీటర్ల మేర పంటలు పంటపొలాలు పూర్తిగా నాశనమవుతున్నాయన్నారు. ఇప్పటి కైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగార్జున, రైతు సంఘం తాలూకా కార్యదర్శి తిప్పేస్వామి, కొట్రేష్ తదితరులు రైతులతో కలిసి కాలుష్యా నికి గురైన పంటపొలాలను పరిశీలించారు. అనంతరం అక్కడ నుండి రైతులతో కలిసి మూకుమ్మడిగా మండల ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎస్‌ఎల్‌వీ, జేఆర్ మెటల్ స్పాంజ్ ఐరన పరిశ్రమల వద్దకు వెళ్లి గతంలో మాదిరిగా రైతులను ఇబ్బంది పెట్టకుండా పంట నష్టపోయిన ప్రతి రైతుకు భారీ మొత్తంలో పరిహారం అందించాలని యాజమా న్యంతో వాగ్వాదానికి దిగారు. రైతులను ఆదుకోకపోతే రాబోవు రోజులలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.