ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 164 సీట్లు సాధించిన విషయం తెలిసిందే. కూటమిలో భాగమైన జనసేన 21 సీట్లు సాధించింది. అయితే ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు మరికొంతమంది కూటమి ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే జనసేన నుంచి 4 మంత్రి పదవులను అడుగుతారని తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేర్లు ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో మరో రెండు పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్‌లకు మంత్రులుగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరికి అపారమైన రాజకీయ అనుభవం కూడా ఉంది. ఈ అంశాలను కూడా పవన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా.. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కీలక నేతలతో ఈరోజు (సోమవారం) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై పవన్ చర్చించారు. మంత్రి వర్గంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరనే దానిపైనా చర్చ జరుగుతోంది. ఈ విషయంపై కూడా నేతలు పవన్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వంలో ఏయే శాఖలు కోరాలి... చంద్రబాబుతో చర్చించే అంశాలపై ముఖ్య నేతల అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. మంగళవారం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకునే అవకాశం ఉంది. విజయవాడలో జరిగే సమావేశంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.