కాకినాడజిల్లా గొల్లప్రోలు పట్టణం, మండల పరిధిలోని గ్రామాల్లోని విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల దుకాణాల్లో వ్యవసాయశాఖ జిల్లా అధికారుల బృందాలు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. పత్తి విత్తనాలు విక్రయిస్తున్న షాపుల్లో నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, ప్రిన్సిపల్ రిజిస్టర్లు సహా ఇతర రికార్డులు తనిఖీ చేశారు. లోపాలు గుర్తించి షాపుల్లో రూ.4.89లక్షల విలువైన 534 పత్తి విత్తన ప్యాకెట్లు విక్రయాలు నిలిపివేస్తూ స్టాప్‌సేల్ ఉత్తర్వులు జారీ చేశారు. విత్తన విక్రయాల్లో నిబంధనలు పాటించకుంటే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో జిల్లా వనరుల కేంద్రం(పెద్దాపురం) డిప్యూటీ డైరెక్టరు బీవీఎస్ హరి, జీబీ కరుణాకర్, వెంకటలక్ష్మిలు పాల్గొనగా, వారి వెంట గొల్లప్రోలు మండల వ్యవసాయాధికారి కేవీవీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.