ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితర ప్రముఖుల సమక్షంలో బుధవారం ఉదయం ఆయన ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ దిగ్గజ వ్యాపార వేత్తల్లో ఒకరైన ఆనందం మహీంద్రా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలుగులో ట్వీట్ చేశారు.
'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు' అంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఓ వార్తా సంస్థ ట్వీట్‌ను జత చేస్తూ ఈ మేరకు ఆయన తెలుగులో శుభాకాంక్షలు తెలపడం గమనార్హం. చంద్రబాబు నాయుడుతో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు ఆనంద్ మహీంద్రా. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాటి నుంచి.. ఆయనతో ఆనంద్ మహీంద్రాకు మంచి అనుబంధం ఉంది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మహీంద్రా సంస్థ భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) అభిమానులు, ఐటీ ఉద్యోగులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో పలువురు నెటిజన్లు ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు కామెంట్లు చేశారు. తెలుగులో ట్వీట్ చేసినందుకు సంతోషంగా ఉందని పలువురు కృతజ్ఞతలు తెలిపారు. కొందరు కృతజ్ఞతలు తెలుపుతూ ఆంధ్రాకు రావాలని ఆహ్వానించారు. ఓ వ్యక్తి మరో అడుగు ముందుకేసి ఉత్తుత్తి శుభాకాంక్షలు కాకుండా విశాఖలో టెక్ మహీంద్రా లేదాంటే రాయలసీమలో ఎంఅండ్ఎం యూనిట్ పెట్టాలని ఉచిత సలహా ఇచ్చాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసిన తర్వాత జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రివర్గం ప్రమాణం చేసింది. జూన్ 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి రికార్డ్ స్థాయిలో 164 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు.