ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎంగా ప్రమాణం చేసిన రోజే.. చంద్రబాబుకి షర్మిల బహిరంగ లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 12, 2024, 07:36 PM

ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా మూడు పార్టీలకు చెందిన మరో 22 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల మీద అభినందనల వర్షం కురుస్తోంది. పలువురు నేతలు వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. చంద్రబాబుకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాసిన షర్మిల.. ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఇక రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను సైతం అందులో ప్రస్తావించారు.


" ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుగారికి మనఃపూర్వక శుభాకాంక్షలు. చారిత్రాత్మకమైన మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా, రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని, సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను మిళితం చేసి ఇకపై ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా, గడిచిన వారం రోజుల్లో, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి, అటు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద, ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డిగారి విగ్రహాల మీద జరుగుతున్న దాడులు మమ్మల్ని ఎంతగానో కలచివేశాయి." అని షర్మిల రాసుకొచ్చారు.


" వారు చేసారని మీరు, మీరు చేసారని భవిష్యతులో మళ్ళీ వాళ్ళు, ఇలా ఈ పగలకు, ప్రతీకారాలు అంతు ఉండదు, సభ్యసమాజంలో, ప్రజాస్వామ్యంలో వీటికి చోటు లేదు, ఉండకూడదు. ఎన్నో తీవ్రమైన సవాళ్ల మధ్య రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా, నిబద్ధతతో జరగాల్సిన ఈ సమయంలో.., ఇటువంటి హేయమైన చర్యలు, దాడులు, శాంతిభద్రతలకు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రగతికి, పేరుకు, అందివచ్చే అవకాశాలకు కూడా తీవ్రమైన విఘాతం కలగజేస్తాయని తెలియజేస్తున్నాము. గడచిన ఐదేండ్లలో జరిగిన విశృంఖల పాలన, దానివలన అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలోపెట్టి ముందుకు తీసుకుని వెళతారని ప్రజలు మీకు ఈ తీర్పు ఇచ్చారు. దానికి అనుగుణంగా నడుచుకుని, వైస్సార్ గారి విగ్రహాల మీద దాడులు, ప్రతిపక్షాల మీద ప్రతీకార చర్యలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము." అని షర్మిల రాసుకొచ్చారు


" మీకున్న అనుభవముతో, మీరు పెద్దమనసు, నిష్పాక్షికత చూపుతూ, పరిస్థితులను చక్కదిద్దుతారని అనుకుంటున్నాము. ఇటువంటి ప్రతీకార రాజకీయాలు, సంస్కారం, విచక్షణకు తావులేని చేష్టలతో మీ పేరుకు, ప్రతిష్టకు, పాలనకు మచ్చ రాకూడదని కోరుకుంటున్నాము. అలాగే రాష్ట్ర ప్రగతి కోసం కాంగ్రెస్ నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుందని తెలియజేసుకుంటున్నాను. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో, ప్రజారంజకంగా సర్కారు పాలన సాగేలా చూడటంలో మీరు ప్రత్యేక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాం. ఇతర మంత్రులందరికీ మా శుభాకాంక్షలు" అంటూ షర్మిల ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com