ఆధునిక సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా మారుతోందన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో స్విట్జర్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక సంచలన ఆవిష్కరణ చేశారు. మానవ మెదడు కణజాలం ఆధారంగా ఒక సజీవ కంప్యూటర్‌ను సృష్టించినట్టు ప్రకటించారు. ‘బ్రెయినోవేర్’ అనే పేరుతో దీనిని అభివృద్ధి చేశారు. మానవ మెదడులోని న్యూరాన్లు, కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను కలిపి దీన్ని సృష్టించడంతో రెండింటి పేర్లు కలిసేలా దీనికి బ్రెయినోవేర్ అనే పేరు సూచించారు. కంప్యూటర్ చిప్ మాదిరిగా సమాచారాన్ని పంచుకునే సామర్ధ్యం ప్రత్యేకత. ఈ కంప్యూటర్ ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ సంక్షోభాన్ని సమర్థవంతంగా పరిష్కరించగలదని భావిస్తున్నారు. దీంతో పలు సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఈ టెక్నాలజీని ఆసక్తిగా గమనిస్తున్నాయి.
అయితే, ఈ టెక్నాలజీ అభివృద్ధిలో అపారమైన చిక్కులు ఉన్నాయి. కానీ, ఇది కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్‌లో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని చెబుతున్నారు. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ మధ్య అంతరాలను చెరిపివేస్తుంది. సామర్థ్యం, కంప్యూటింగ్ పరంగా దీని ప్రయోజనాలు కాదనలేనివి. ఈ లివింగ్ కంప్యూటర్ సృష్టి సాంకేతికతలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. అంతేకాదు, సాధ్యాసాధ్యాలపై మానవ ఆలోచనలను ఇది సవాల్ చేస్తుంది. కృత్రిమ మేధస్సు, టెక్నాలజీతో మానవత్వం భవిష్యత్తు గురించి కూడా లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. మెదడు కణజాలంతో ప్రయోగశాలలో రూపుదిద్దుకున్న ఇందులోని 16 ఆర్గానాయిడ్‌లు ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకుంటాయి. ఇవి సాంప్రదాయిక కంప్యూటర్ చిప్‌తో సమానంగా పనిచేస్తాయి. సాధారణ కంప్యూటర్ చిప్ సర్క్యూట్‌ల మాదిరిగా న్యూరాన్‌ల ద్వారా సంకేతాలను పంపడం, స్వీకరించడం వంటి ప్రక్రియను నిర్వహిస్తాయి.
తక్కువ శక్తిని వినియోగించడం దీని మరో ప్రత్యేకత. ఎందుకంటే ప్రస్తుతం వాడుకలో ఉన్న డిజిటల్ ప్రాసెసర్‌ల కంటే జీవించే న్యూరాన్‌లు మిలియన్ రెట్లు తక్కువ శక్తిని ఉపయోగించగలవు. అంటే భారీ సంఖ్యలో ఎనర్జీ ఆదా అవుతుంది. హెచ్‌పీ వంటి ప్రపంచంలోని అత్యుత్తమ కంప్యూటర్‌లతో పోల్చినప్పుడు ఈ మానవ మెదడు అదే వేగంతో, 1,000 రెట్లు ఎక్కువ మెమరీతో పనిచేస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. సాధారణ కంప్యూటర్ 21 మెగా వాట్ల ఎనర్జీ ఉపయోగిస్తే, ఈ లివింగ్ కంప్యూటర్ 10 నుంచి 20 వాట్ల విద్యుత్‌ను మాత్రమే ఉపయోగిస్తుంది.
ఈ కంప్యూటన్‌ను తయారీలో కీలకంగా వ్యవహరించిన స్టార్టప్ కంపెనీ ఫినాల్‌స్పార్క్ సీఈఓ డాక్టర్ ఫ్రెడ్ జోర్డాన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘సైన్స్ ఫిక్షన్‌లో ఈ ఆలోచన సాధారణం, కానీ దానిపై వాస్తవ పరిశోధనల సంఖ్య ఆశించినంతగా లేదు’ అని పేర్కొన్నారు. మానవ మెదడు నుంచి కణజాలం సేకరించి, ఆర్గనాయిడ్‌లను అభివృద్ధి చేయడానికి నెల రోజుల సమయం పట్టిందని తెలిపారు. ఆర్గానాయిడ్స్ డోపమైన్ డోస్ ద్వారా శిక్షపొందిన ఈ ఆర్గనాయిడ్స్.. తమ పనులను సక్రమంగా నిర్వహించినప్పుడు సంకేతాలను స్వీకరిస్తాయి. ఒక నిర్దిష్ట ప్రాంతం యాక్టివేట్ అయినప్పుడు మానవ మెదడులో ఇది ఎలా విడుదలవుతుందో అదే విధంగా ఉంటుందని పేర్కొన్నారు.