తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన పలువురు వలంటీర్లు పీలేరు ఎంపీడీవోకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో వైసీపీ నాయకులు తమతో బలవంతంగా రాజీమానాలు చేయించారని, రాజీనామా చేయడానికి ఒప్పుకోని పలువురు వలంటీర్ల సీఎఫ్‌ఎంఎస్ ఐడీలు తెలుసుకుని వారికి తెలియకుండానే వైసీపీ నాయకులు రాజీనామా లేఖలు అందజేసేశారని వారు వాపోయారు. మరికొంత మందిని అప్పటి నేతలు బెదిరించారని వారు తెలిపారు. చాలీచాలని జీతమే అయినప్పటికీ తాము చిత్తశుద్ధితో వలంటీరు ఉద్యోగం చేశామని, చాలా మందికి వయసు మీరిపోవడంతో ఇతర ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. తమకు తిరిగి తమ ఉద్యోగాలు ఇప్పిస్తే తమ కుటుంబాలను నిలబెట్టినట్లు అవుతుందని వారు అభ్యర్థించారు. ఈ మేరకు పీలేరు ఎంపీడీవో ఉపేంద్ర కుమార్ రెడ్డికి వారు వినతి పత్రం అందజేశారు. వలంటీర్లు అందజేసిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి పంపుతామని ఆయన తెలిపారు.
![]() |
![]() |