ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వింత సంఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి చిన్న కుక్క పిల్లను తీసుకుని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. ఆ క్రమంలో కుక్కను తీసుకుని వెళ్లి పిల్లికి వైద్యం చేయాలని అక్కడి ఆస్పత్రి సిబ్బందితో నానా రచ్చ చేశాడు. ఇక్కడ మనుషులకు మాత్రం వైద్యం చేస్తామని, దానిని తీసుకుని పశు వైద్య శాలకు వెళ్లాలని చెప్పినా వినలేదు. డాక్టర్ చదువుకున్నాడు కదా, వైద్యం చేసేందుకు ఏంటి సమస్య అని సిబ్బందితో వాదనకు దిగాడు. దీంతో ఆస్పత్రిలో కొద్ది సేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది. అది చూసిన పలువురు ఆశ్చర్యపోగా, మరికొంత మంది మాత్రం నవ్వుకుంటూ అతను మద్యం మత్తులో ఉన్నాడని పట్టించుకోలేదు. చివరకు ఎంత చెప్పినా కూడా ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు చెప్పక తప్పలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ మందుబాబుకు నచ్చజెప్పి ఆ ప్రాంతం నుంచి పంపించారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది హమ్మయ్యా అనుకున్నారు. అయితే ఆ వ్యక్తి ఆస్పత్రికి వచ్చిన సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. కుక్క పిల్లను తీసుకుని వచ్చి వాగ్వాదానికి పాల్పడటం వీడియోలో కనిపిస్తుంది. ఈ క్రేజీ వీడియో ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
![]() |
![]() |