6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలందరూ విధిగా పాఠశాలలకు వెళ్లేటట్లు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని పీలేరు ఎంపీడీవో ఉపేంద్ర రెడ్డి అన్నారు. ‘నేను బడికి పోతా’ కార్యక్రమంపై బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు, బడి మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించేందుకు ప్రభుత్వం జూన 13వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు ‘నేను బడికి పోతా’ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. మండల కమిటీలోని వివిధ శాఖల అధికారులు తమ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుని ఆ కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సదుపాయాలను పిల్లలు, వారి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. అంతకు మునుపు పీలేరు ఎంఈవోలు లోకేశ్వర్ రెడ్డి, పద్మావతమ్మ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల హెచఎంలు, పేరెంట్స్ కమిటీ సభ్యులతో సమీక్షించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో తహసీల్దారు మహబూబ్ బాషా, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ స్వరూప, హెచఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు రహత బాషా, అక్రమ్ బాషా, సీఆర్‌పీ మురళీధర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.