గత వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేయడంతోపాటు ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలోనూ పూర్తిగా విఫలమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి ధ్వజమెత్తారు. ఒంగోలు , ప్రకాశం భవన్‌లోని స్పందన హాలులో బుధవారం కలెక్టర్ దినేష్‌కుమార్ నేతృత్వంలో మంత్రి, ఎమ్మెల్యేలకు జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, వైద్య, విద్య, వ్యవసాయశాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గత ప్రభుత్వ హయంలో చేపట్టిన వివిధ రకాల పనుల్లో డొల్లతనాన్ని సంబంధిత అధికారులే ప్రస్తావించడంతో మంత్రి స్వామితోపాటు ఎమ్మెల్యేలు కూడా అవాక్కయ్యారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పూర్తికాకుండానే జిల్లా ప్రజలను మభ్యపెట్టేందుకు హడావుడిగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభోత్సవం చేశారని మండిపడ్డారు. ఒకవైపు లైనింగ్ పనులు జరుగుతుండగా, ఇంకోవైపు పునరావాసానికి అవసరమైన నిధులు కూడా మంజూరు చేయలేదని తెలిపారు. 2020లో మల్లవరం ఒక గేటు విరిగిపోగా, ఆ పనిని చేపట్టకముందే మరోగేటు కూడా కొట్టుకుపోయిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సాగు, తాగునీటికి రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రాజెక్టుకు గేట్ల బాగుతోపాటు నిర్వహణ కోసం రూ.15కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు చేయలేదన్నారు. సత్వరమే ఆ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదటి ప్రాధాన్యతగాను, రెండోదిగా వెలిగొండ ప్రాజెక్టుకు తీసుకున్నారన్నారు. త్వరలోనే సీఎం సమీక్ష నిర్వహిస్తారని ఆలోపు సమగ్ర నివేదికను తయారుచేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నందున ప్రజలకు అవసరమైన మేరకు నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి, సంక్షేమం కోసం అఽధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడి క్షేత్రస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుని ముందుకు సాగాలన్నారు. మరోవైపు వైద్యశాఖ సమీక్షలో కూడా డొల్లతనం బయటపడింది. సీజనల్ వ్యాధులపై జరుగుతున్న సర్వే ఎక్కడ నిర్వహిస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగులు, వైద్యశాఖల మధ్య సమన్వయం లేకపోతే ఎలా అని నిలదీశారు. కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ ఆయా అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ జిల్లాలో పోలీస్‌శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.