పదవీ విరమణ వయోపరిమితి పెంచాలని ఐటీడీఏల పరిధిలో గురుకుల ఉద్యోగులు కోరుతున్నారు. ఈ మేరకు వారు కోర్టును ఆశ్రయించారు. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ చర్యలు తీసుకున్నారు. అయితే గత వైసీపీ సర్కారు గురుకుల కళాశాల పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆ అవకాశం కల్పించలేదు. పదవీ విరమణ వయోపరిమితిని పెంచలేదు. తమకు రిటైర్‌మెంట్ వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని వారు గత వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టడంతో ఆయా ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ జూన్‌లో పదవీ విరమణ చేయనున్న వారంతా హైకోర్టును ఆశ్రయించారు. అన్ని సొసైటీల ఉద్యోగులకు పదవీ విరమణ వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచినప్పటికీ తమకు పెంచలేదని, ఈ అంశాన్ని పరిగణనలోనికి తీసుకుని.. న్యాయం చేయాలని గురుకుల ఉద్యోగులు కోరుతున్నారు.