గ్రామస్థాయి నుంచి సీపీఐ పార్టీని సంస్థాగతంగా నిర్మించుకుంటూ పార్టీని బలోపేతం చేద్దామని ఆ పార్టీ రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు. బుధవారం రాజమహేంద్రవరంలోని సీపీఐ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం నగర కార్యదర్శి కొండలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మదు మాట్లాడుతూ జులై 1, 2, 3 తేదీల్లో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు ప్రారంభమవుతున్నాయని, ఈ సమావేశంలో పార్లమెంట్, శాసనసభ ఎన్నికల సమీక్ష, పార్టీ ప్రజాసంఘాల నిర్మాణం తదితర అంశాలపై నివేదికలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పార్టీ నిర్మాణం, ప్రజాసంఘాల అంశాలు చర్చించి జిల్లా కార్యవర్గం ఒక డాక్యుమెంట్‌ను ప్రవేశపెడుతుందని అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అఽధికారంలోకి వచ్చిందని, అవన్నీ అమలు చేసే వరకూ తాము ప్రశ్నిస్తామని అన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి పోలవరం పూర్తి చేస్తే చంద్రబాబు అపరభగీరధుడిగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు కూండ్రపు రాంబాబు, రేఖ భాస్కరరావు, జిల్లా కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు.