ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటిగా పోలవరంలో పర్యటించారు. తన రెండో పర్యటనలో భాగంగా రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో అమరావతి నిర్మాణ పనులను వేగవంతంగా చేయడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేయనున్నారు. గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న నారాయణ అమరావతి నిర్మాణంలో కీలకంగా పనిచేశారు. ఆయనకు రాజధానిపై పూర్తి అవగాహన ఉండటంతో మరోసారి ఆయనను ఆ శాఖ మంత్రిగా నిర్మించారు. దీంతో అమరావతిపై చంద్రబాబుకు ఉన్న శ్రద్ధ అర్థమవుతోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఈ రోజు పర్యటిస్తుండటంతో అక్కడి ప్రజలంతా తమకు మంచి రోజులు వచ్చాయంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్ల పాటు నరకయాతన అనుభవించామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన అమరావతిలోని పలు నిర్మాణలు, రాజధాని ప్రాంత నిర్మాణ స్థితిగుతులను చంద్రబాబు తన పర్యటనలో తెలుసుకోనున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు తొలుత ప్రజావేదిక శిథిలాల్ని పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని చంద్రబాబు పరిశీలిస్తారు. రాజధాని నిర్మాణంపై తన కార్యాచరణ ప్రణాళికను చంద్రబాబు ఇవాళ మీడియాకు వివరించే అవకాశం ఉంది.