ఎన్నికల్లో మోసం జరిగిందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి వ్యాఖ్యానించారు. అయితే ఇందుకు సాక్ష్యాలు, ఆధారాల్లేవని చెప్పారు. టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలో ఘోరం జరిగిపోతోందని ఆరోపించారు. రెడ్‌బుక్ చూపిస్తూ హోర్డింగులు పెడుతూ వైసీపీ నేతలను బెదిరిస్తున్నారని అన్నారు. గురువారమిక్కడ తాడేపల్లి ప్యాలె్‌సలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. జగన్ సహా 11 మంది ఎమ్మెల్యేలు, నలుగురు లోక్‌సభ సభ్యులు, ఓడిపోయిన అభ్యర్థులను మాత్రమే ఆహ్వానించారు. పార్టీ కార్యవర్గ సభ్యులను ఆహ్వానించలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఈ నెల ఏడో తేదీన.. గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో, ఓడిన అభ్యర్థులను పిలిపించుకుని మాట్లాడినప్పుడు జగన్ ఏం చెప్పారో.. గురువారం కూడా అవే చెప్పారు. ఈవీఎంలపై అనుమానాలున్నా ఆధారాల్లేవన్నారు. ఫలితాలు వచ్చాక వైసీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు జరిగాయని.. వారందరికీ అండగా ఉండాలని నేతలకు సూచించారు. ప్రత్యర్థుల దాడిలో మృతి చెందినవారి కుటుంబాలను డిసెంబరు తర్వాత తాను ఓదార్చుతానని.. గాయపడ్డ కార్యకర్తలను పరామర్శిస్తానని తెలిపారు.