జాతీయరహదారి 216హెచ్(పోర్డురోడ్డు) కానుమోలు శివారు నుంచి వేలేరు మీదుగా ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలం సీతారాంపురం వరకు నిర్మించే రహదారి భూసేకరణ నిమిత్తం విధి, విధానాలతో కూడిన కార్యాచరణ ప్రకటిస్తేనే భూములిస్తామని రైతులు తేల్చి చెప్పారు. వేలేరులో గుడివాడ ఆర్డీవో పి. పద్మావతి, ఎన్‌హెచ్216హెచ్ మచిలీపట్నం, ప్రాజెక్ట్ డైరెక్టర్, సాయిశ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం భూసేకరణ సదస్సు నిర్వహించారు. రైతులకు ఎటువంటి సమాచారం లేకుండానే గుగుల్ మ్యాప్ ఆధారంగా సాగు భూముల్లో సర్వే చేసి కాంక్రీట్ పిల్లర్లు వేయడం పట్ల అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు భూములను ప్రభుత్వ భూములుగా చూపడంపై ప్రశ్నిస్తూ సదస్సును అడ్డుకున్నారు. మండల సర్వేయర్ ఫణికుమార్ రైతులతో దురుసుగా ప్రవర్తించారని ఆర్డీవో ఎదుట ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మరల ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామని ఆర్డీవో, పీడీ హామీపై రైతులు శాంతించడంతో సదస్సు నిర్వహించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటలకు, కట్టడాలకు, బోర్లకు, డ్రిప్, పైప్‌లైన్లకు, టేకు, వేప, తదితర వృక్షాలకు పోలవరం కుడికాలువ నిర్మాణానికి ఏ విధంగా భూసేకరణ నష్టపరిహారం ఇచ్చారో అదే విధంగా అమలు చేయాలని, ఉన్నతస్థాయి కమిటీతో సమావేశం జరిగేలా చూడాలని కోరుతూ రైతుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్నిగ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వేములపల్లి శ్రీనివాసరావు అధికారులకు అందజేశారు. అధికారులకు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోకుండా పనులు చేస్తున్నారని, ఈసారి పనులను అడ్డుకుంటామని రైతులు, ప్రజలు హెచ్చరించారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లి త్వరలోనే ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆర్డీవో పద్మావతి. పీడీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్ధార్ శ్రీనివాస్, ఎన్‌హెచ్ ఏఈ వెంకట్, సర్వే(డీఐ) నరసింహారావు, రైతులు పాల్గొన్నారు.