ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తొలిసారి కుప్పం రానున్నారు. ఈనెల 25, 26 తేదీల్లో ఆయన పర్యటన దాదాపు ఖరారైంది. ఈనెల 23, 24 తేదీలలో శాసనసభ సమావేశాలు ముగిశాక తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండు రోజుల పర్యటనకు చంద్రబాబు వస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కుప్పం నుంచి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు, నాల్గవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా కుప్పంలో పర్యటించనున్న అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రికి టీడీపీ వర్గాలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ప్రారంభించాయి. తాజా విజయంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతోంది. అదే సమయంలో అధికార వర్గాల్లో గుబులు బయలుదేరింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరించిన వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు ఇంకా ఆయా సీట్లలోనే ఉన్నారు. అటువంటి వారు ముఖ్యమంత్రి రాకపట్ల ఆందోళనగా ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగంతోపాటు వ్యవహారాలపై పూర్తిస్థాయి పట్టువున్న చంద్రబాబు నాయుడు ఈ అవకతవకల గురించి, ఎటువంటి అవినీతి చర్యల గురించి ప్రశ్నిస్తారో, ఏమి సమాధానం చెప్పాలో అన్న భయం వారిలో కనిపిస్తోంది. కాగా, 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రి కుప్పం పర్యటన ఖరారైనా, ఏయే కార్యక్రమాల్లో పాల్గొంటారనే విషయంలో స్పష్టత లేదు. టీడీపీ శ్రేణులు, కార్యకర్తలతో ముఖాముఖిగా పాల్గొననున్నారని ప్రాథమిక సమాచారం. కుప్పంలో బహిరంగ సభ నిర్వహించాలన్న యోచనలో స్థానిక పార్టీ యంత్రాంగం ఉంది. మరోవైపు సీఎం పర్యటన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో చర్చించేందుకు కలెక్టర్ షన్మోహన్ గురువారం అమరావతికి వెళ్లినట్లు సమాచారం. ఇక, కుప్పంలో సీఎం బస చేయనున్న ఆర్అండ్బీ అతిథిగృహ ఆధునికీకరణ పనులను అఽధికారులు చేపట్టారు. పాత తహసీల్దార్ కార్యాలయంలో అన్న క్యాంటీన్ పునఃప్రారంభించేందుకు అధికారులు పనులు చేస్తున్నారు. సీఎం పర్యటన వివరాలు అధికారికంగా ఇంతవరకు జిల్లాకేంద్రానికి రాలేదు.