వారిద్దరూ ప్రపంచంలోనే రెండు దేశాలను ఏలుతున్న నియంతలు. ఒకరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కాగా.. మరొకరు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఇక ఇటీవల పుతిన్.. ఉత్తర కొరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు దేశాలకు సంబంధించి కొన్ని ఒప్పందాలపై.. పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకున్నారు. కిమ్ జోంగ్ ఉన్‌కు.. అత్యంత ఖరీదైన కారును పుతిన్ బహుమతిగా ఇచ్చారు. ఇక పుతిన్‌కు అత్యంత అరుదైన రకం జాతికి చెందిన రెండు కుక్కలను కిమ్ జోంగ్ ఉన్ అందించారు. అయితే వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
దాదాపు 24 ఏళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. తాజాగా ఉత్తర కొరియాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఉత్తర కొరియా అధినేతకు.. పుతిన్ అత్యంత ఖరీదైన లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. రష్యన్ మేడ్ లిమోసిన్ కారును కిమ్ జోంగ్ ఉన్‌కు అందించారు. ఆ తర్వాత అదే లిమోసిన్ కారులో ఇద్దరూ కలిసి సరదాగా అలా కొద్ది దూరం వెళ్లి వచ్చారు. ఆ సమయంలో ఆ లిమోసిన్ కారును పుతిన్ స్వయంగా నడపగా.. పక్కనే కిమ్ కూర్చున్నారు. ఆ తర్వాత అదే లిమోసిన్ కారును.. కిమ్ నడపగా.. పుతిన్ పక్కనే కూర్చున్నారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కిమ్, పుతిన్ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండటం కనిపించింది. ఇక కిమ్‌కు పుతిన్ బహుమతిగా ఇచ్చిన లిమోసిన్ కారు.. రష్యాలోనే తయారైంది. పుతిన్ తన కాన్వాయ్‌లో ఇలాంటి లిమోసిన్ కార్లనే ఉపయోగిస్తున్నారు.
ఇక అంతకుముందే పుతిన్‌కు కిమ్ కూడా కొన్ని గిఫ్ట్‌లు అందించారు. తన వద్ద ఉన్న అరుదైన కొరియన్ జాతి కుక్కలను పుతిన్‌కు కిమ్ బహుమతిగా ఇచ్చారు. ఫుంగ్‌సన్ జాతికి చెందిన ఆ శునకాలను పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారు. కొరియా ద్వీపకల్పంలో ఉత్తరం వైపు ఉన్న కొండ ప్రాంతాల్లో ఈ ఫుంగ్‌సన్ జాతి కుక్కలు నివసిస్తూ ఉంటాయి. మంచును తట్టుకునే చర్మం ఆ శునకాలకు ఉంటుంది. అంతేకాకుండా పెద్ద పెద్ద జంతువులను కూడా ఢీకొట్టే సామర్థ్యం కలిగి ఉంటాయి.
ఇక ఈ పర్యటనలో ఉత్తర కొరియా, రష్యాల మధ్య సరికొత్త భాగస్వామ్య ఒప్పందాలు కుదిరాయి. వీటిపై ఇరు దేశాల అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ సంతకాలు చేసేశారు. రష్యా, ఉత్తర కొరియా దేశాల్లో ఏ దేశంపైన గానీ.. ఇతర దేశాలు దాడి జరిపితే పరస్పరం సహకరించుకోవడంతో పాటు భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతికం, మానవీయ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఆ ఒప్పందాల్లో పేర్కొన్నారు. ఇవే కాకుండా ఆరోగ్యం, వైద్య విద్య, సైన్స్ విభాగాల్లో రెండు దేశాలు సహకరించుకునేలా పలు ఒప్పందాలు చేసుకున్నారు. ఉత్తర కొరియా, రష్యాలకు.. పశ్చిమ దేశాలతో ఇటీవలి కాలంలో తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఒప్పందాలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.