మీరు మంచి భోజనప్రియులా.. రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ టేస్ట్ చేయడం మీకు అలవాటా.. అయితే మీకో అలర్ట్. ఎందుకంటే మీరు రెస్టారెంట్‌కు వెళ్లి వెజ్ ఆర్డరిస్తే అందులో నాన్ వెజ్ రావచ్చు. మంచిదే కదా అనుకుంటున్నారా.. నాన్ వెజ్ అంటే ఏ చికెనో, మటనో అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే మీ ప్లేట్లో వచ్చేది కోడి, మేక కాదు.. బొద్దింక, జెర్రిలు కావొచ్చు. ఎందుకంటే బిర్యానీలో బొద్దింక, ఐస్‌క్రీమ్‌లో జెర్రీ.. ఇలాంటి వార్తలు ఈ మధ్య సర్వసాధారణమైపోయాయి. అందుకే ఆర్డర్ రాగానే ఆబగా తినేయకుండా.. దానిపై ఓ కన్నేయండి. ఇక తాజాగా ఇలాంటి ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.
తిరుపతిలోని లీలామహల్ సెంటర్లో ఉన్న పీఎస్4 హోటల్‌కు వాసు అనే వ్యక్తి, అతని స్నేహితులు భోం చేయడానికి వెళ్లారు. పుత్తూరు వాసులైన వీరు తిరుపతిలోని ఓ ఆస్పత్రికి వచ్చారు. అయితే ఆకలి వేయటంతో పీఎస్4 హోటల్‌కు భోజనం చేయడానికి వెళ్లారు. హోటల్‌కు వెళ్లి రెండు ప్లేట్లు మీల్స్ ఆర్డర్ చేశారు. రాగానే ఆబగా తినడం మొదలెట్టారు. అయితే సగం భోజనం చేసిన తర్వాత భోజనం ప్లేట్లో జెర్రి ప్రత్యక్షమైంది. దీంతో కంగు తినడం వాసు అండ్ కో వంతైంది. దీనిపై హోటల్ సిబ్బందిని నిలదీశారు. డబ్బులు చెల్లించి భోజనం చేసేందుకు వస్తే ఇలాంటి భోజనం పెడతారా అంటూ నిలదీశారు. అయితే హోటల్ సిబ్బంది వీరిపట్ల దౌర్జన్యం చేయడంతో.. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అధికారులకు ఫిర్యాదుచేశారు.
వాసు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పీఎస్4 హోటల్‌లో తనిఖీలు నిర్వహించారు. భోజనం నాణ్యతతోపాటుగా కిచెన్ పరిసరాలను పరిశీలించారు. కూరగాయలతో పాటు, వంటల్లో నాణ్యతా లోపాలు ఉన్నట్లు గుర్తించారు. కిచెన్‌ను సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. కేసు నమోదుచేశారు. మరోవైపు భోజనంలో జెర్రి వచ్చిందనే విషయం తెలుసుకుని మిగతా కస్టమర్లు కూడా హోటల్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. దీంతో హోటల్ వద్ద స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. అయితే అధికారులు వచ్చి తనిఖీలు చేపట్టడంతో.. కస్టమర్లు శాంతించారు.