సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా రావడం సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్. ఇన్ని దశాబ్దాల్లో ప్రజలు అయ్యన్నపాత్రుడి వాడివేడి చూశారని.. ఇన్నాళ్లూ ప్రజలు ఆయన వాగ్దాటి చూశారన్నారు. నేటి నుంచి రాష్ట్ర ప్రజలు ఆయనలో హుందాతనం చూస్తారన్నారు. గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణల చేసిందని.. రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందన్నారు. ఎప్పుడైనా భాష మనసులను కలపడానికే.. విడగొట్టడానికి కాదని వ్యాఖ్యానించారు. ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.
'ఒక్కటే బాధగా ఉంది.. ఇక మీదట మీకు తిట్టే అవకాశం లేదు' అంటూ పవన్ కళ్యాణ్ చమత్కరించారు. 'మీకు కోపం వస్తే.. రుషికొండను చెక్కినట్లు పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండుకొట్టేస్తారు.. ఇకపై మీకు తిట్టే అవకాశం లేకపోవచ్చు.. ఇక సభలో ఎవరు తిడుతున్నా వారిని నియంత్రించే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. మీరే కంట్రోల్ చేయాలి'అనగానే సభలో సభ్యులంతా నవ్వారు. సభాపతి హోదాలో సభను ముందుకు తీసుకెళ్లాలని అయ్యన్నపాత్రుడిని కోరారు పవన్ కళ్యాణ్.
గెలుపును స్వీకరించినట్లే.. ఓటమిని కూడా హుందాగా స్వీకరించాలన్నారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు, బూతులు ఉండేవని.. సంస్కారహీనమైన భావనలను నియంత్రించాలని స్పీకర్‌కు సూచించారు. గెలుపును స్వీకరించినట్టు ఓటమిని వైఎస్సార్‌సీపీ స్వీకరించలేకపోయిందని.. అందుకే అసెంబ్లీ నుంచి పారిపోయారన్నారు. విభేదించడం, వాదించడం చర్చకు మూల సిద్ధాంతాలన్న పవన్..అంతేగాని, దూషణలు, కొట్లాటలు కాదన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ఉన్నతంగా ఉండాలని.. ఇప్పుడే దానికి పునాది వెయ్యాలి అన్నారు.
సభ హుందాతనాన్ని కాపాడి, భవిష్యత్ తరాలకు ప్రామాణికంగా నిలపాలని ఆకాంక్షించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విభేదించడం అంటే ద్వేషించడం కాదని.. వాదించడం అంటే కొట్టుకోవడం కాదు అన్నారు. సభలో కచ్చితంగా ప్రజాసంక్షేమం కోసం చర్చలు జరగాలని.. వాదోపవాదాలు హద్దులు దాటకూడదన్నారు. వ్యక్తిగత దూషణలకు తావు ఉండకూడదన్నారు.