ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. 164 స్థానాలతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీ 135, జనసేన పార్టీ 21, బీజేపీ 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. జనసేన పార్టీ పోటీచేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి గెలిచింది.. రెండు ఎంపీ సీట్లలో పోటీ చేసి, రెండు గెలుచుకుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో పోటీచేసిన 23 స్థానాల్లో 23 చోట్ల (21 ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు) గెలిచి జనసేన పార్టీ వందకు వందశాతం స్ట్రైక్ రేట్ సాధించింది.
జనసేన పార్టీ గెలుపు, అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు ప్రశంసలు కురిపించారు. ఆలయంలో ఉన్నా సరే తాను కొన్ని విషయాలను అందరితో పంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. 'నిన్నటి వరకు అధికారంలో ఉన్నవాళ్లు దిగిపోయారు.. ఇక రారేమో అనుకున్నవాళ్లు పైకొచ్చారు. ఇంతకంటే భగవంతుడి లీలకు ఉదాహరణ వేరేది అక్కర్లేదు.చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు కాపాడతాడు అనడానికి.. నేను దేవాలయంలో ఉండి కూడా నిర్మోహమాటంగా రాజకీయాల గురించి చెబుతున్నాను' అన్నారు.
చిత్తశుద్ధితో తనకు ఇచ్చిన సీట్లు చాలు.. వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ 23 చోట్ల గెలిచారు (21 అసెంబ్లీ, 2 ఎంపీలు) అన్నారు నరసింహరావు. భగవంతుడి ఆశీర్వచనం పవన్ కళ్యాణ్‌కు, పార్టీకి, ఆంధ్రప్రదేశ్‌కు సంపూర్ణంగా లభించాలని కోరుకుంటున్నానన్నారు. తనకు పార్టీలు, పక్షపాతాలు లేవని.. తాను ధర్మపక్షపాతిని అన్నారు. అంతటి ఇమేజ్ ఉన్నవాళ్లెవరూ 21 ఎమ్మెల్యే సీట్లకు ఒప్పుకోరని.. అక్కర్లేదు తమకు పొత్తు ప్రధానం, ముందు గెలవడం ప్రధానం, అదికూడా ప్రజల కోసం అనడం గొప్ప విషయమన్నారు. ఇవాళ ఆయనకు ప్రాధాన్యం ఉంటుందని వేరే చెప్పక్కర్లేదని.. అది లేకపోతే ఏదీ ఉండదన్నారు. 'ఎలా వస్తుంది మనకు ప్రాధాన్యం.. చిత్తశుద్ధి కారణంగా వస్తుంది. భగవంతుడి మీద అచెంచలమైన విశ్వాసం కారణంగా వస్తుంది 'అన్నారు గరికిపాటి నరసింహారావు.
గరికిపాటి నరసింహారావు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసైనికులు ఈ వీడియోను ట్వీట్ చేస్తున్నారు. అది తమ అభిమాన నేత పవన్ కళ్యాణ్ గొప్పతనం అంటూ ప్రశంసిస్తున్నారు. రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గొప్ప నిర్ణయం తీసుకున్నారంటున్నారు. మొత్తానికి గరికిపాటి వీడియో ఇప్పుడు హైలైట్ అవుతోంది.