ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ఆ పార్టీ నేతలు కారణాలు విశ్లేషించుకుంటున్నారు. ఇంతటి ఘోర పరాజయానికి కారణం ఏమై ఉండొచ్చనే దానిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే గురజాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమికి, టీడీపీ విజయానికి కారణాలు ఇవేనంటూ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కారణాలే చంద్రబాబులో, టీడీపీలో కసిని పెంచాయని ఆయన విశ్లేషించారు.
"గడిచిన రెండు వారాల నుంచి కార్యకర్తలు, నాయకులు వచ్చి కలుస్తున్నారు. ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే. ఇంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసినా, గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యేలు జనాలకు అందుబాటులో ఉన్నా.. ఎందుకు ఓడిపోయామని అందరూ అడుగుతున్నారు. వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్యకర్తకూ చెప్పేది ఒకటే . రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణం. స్పోర్టివ్‌గా తీసుకోవాలి. ప్రతిపక్ష పాత్రను హుందాగా నిర్వర్తించాలి. అయితే ఓడిపోవటానికి రెండు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. సంక్షేమం బ్రహ్మాండంగా చేసినా లోపాలు కనిపిస్తున్నాయి. కార్యకర్తలు, నాయకులే ఈ విషయాలు చెప్పారు" అని కాసు మహేష్ రెడ్డి చెప్పారు.
" ముఖ్యమైన విషయం ఏమింటంటే మద్యం విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందనేది వాస్తవం. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.. అధిగమించాలని ఈ విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయిరెడ్డికి అనేకసార్లు చెప్పాం. అయితే దురదృష్టకరం, ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దాని పర్యవసానం ఈరోజు కనిపిస్తోంది. రోజూ 20 నుంచి 25 శాతం మంది మద్యం తాగుతుంటారు. నాసిరకం మద్యాన్ని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారాన్ని వాళ్లంతా నమ్మారు. అలాగే ఇసుక మీద ఆధారపడే వాళ్లు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. కార్మికులంతా మెరుగైన ఇసుక పాలసీ తెస్తారని టీడీపీకి ఓటేశారు. ఈ రకంగా కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలో మద్యం, ఇసుక పాలసీ దెబ్బకొట్టాయి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వైసీపీని దెబ్బకొట్టింది." అని మహేష్ రెడ్డి విశ్లేషించారు.
"అన్నింటికన్నా ముఖ్యంగా రాజకీయంగా మరో కారణం ఉంది. ఆరోజు వైఎస్ జగన్ పార్టీ పెట్టడానికి, వైసీపీ అధికారంలోకి రావటానికి కారణం.. అలాగే ఈరోజు చంద్రబాబు గెలవడానికి కారణం.. అవమానం. ఆ అవమానమే మనిషిలో కసిని పెంచుతుంది. మనిషి పోరాట పటిమను పెంచుతుంది. ఇదే విషయాన్ని చరిత్ర చెబుతుంది. ఆనాడు వైఎస్ జగన్‌ను కాంగ్రెస్ అవమానించి, జైళ్లో పెడితే.. వైసీపీ కార్యకర్తల్లో కసి పెరిగింది. గెలిపించారు. ఇప్పుడూ అలాగే.. కొంతమంది వైసీపీ నాయకులు, ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఒకరిద్దరు నాయకులు చంద్రబాబును అవమానించేలా మాట్లాడారు. అలాగే చంద్రబాబును జైళ్లో పెట్డడం కూడా టీడీపీ కార్యకర్తలు అవమానంగా భావించారు. కసితో పనిచేశారు. గెలిపించుకున్నారు. అని కాసు మహేష్ రెడ్డి విశ్లేషించారు.