భారతదేశంలో పారిశ్రామిక ఉత్పత్తుల విక్రయాల విభాగంలో అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీగా పేరొందిన మోగ్లిక్స్ ఇప్పుడు మన విశాఖపట్నంలో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. పరిశ్రమల నిర్వహణ, మరమ్మతులకు అవసరమైన అన్ని రకాల వస్తువులు, పరికరాలను ఆన్‌లైన్ ద్వారా విక్రయించే బీ2బీ సంస్థ ఇది. వైజాగ్‌లో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.10 కోట్ల వరకూ పెట్టుబడులు పెడుతున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (స్ట్రాటజీ, ఆపరేషన్స్) సందీప్ గోయెల్ తెలిపారు. ఆ వివరాలు ఓసారి పరిశీలిద్దాం.
పరిశ్రమలతో పాటు, మౌలిక వసతుల నిర్మాణ సంస్థలు వృద్ధి సాధిస్తున్న క్రమంలోనే తమ వ్యాపార విస్తరణకు ప్రణాళికలు చేపట్టినట్లు వివరించారు మోగ్లిక్స్ ఎండీ సందీప్ గోయెల్. దేశ వ్యాప్తంగా హైదరాబాద్ సహా మొత్తం 40 కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం 2024- 25 చివరి నాటికి కొత్తగా మరో 10 కేంద్రాల వరకూ ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. ప్రస్తుతం తమ కంపెనీలో 1000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ ఏడాది కొత్తగా మరో 500 మందిని తీసుకోనున్నట్లు వెల్లడించారు సందీప్ గోయెల్.
ప్రస్తుతం మోగ్లిక్స్ సంస్థ పలు కంపెనీలకు చెందిన 3000 ప్లాంట్లతో కలిసి పని చేస్తున్నట్లు పేర్కొన్నారు సందీప్ గోయెల్. యూఏఈలోనూ తమ కంపెనీ సేవలందిస్తోందని, కొత్త ప్రాంతలకూ విస్తరించేందుకూ ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందించేందుకు తమ అనుబంధ సంస్థతో కలిసి పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే తమ కంపెనీ ఇప్పటి వరకు రూ. 2 వేల 400 కోట్ల మేర పెట్టుబడులు సమీకరించిందని తెలిపారు. అలాగే రాబోయే రెండు నుంచి ముడేళ్లలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కు వచ్చే ప్రణాళికల్లో మోగ్లిక్స్ సంస్థ ఉన్నట్లు వెల్లడించారు.