ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో ప్రతీ దానికి మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే గత కొన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ స్పీకర్ ఎన్నికకు రంగం సిద్ధం అయింది. ఈ నేపథ్యంలోనే స్వాతంత్య్ర భారతదేశంలో మూడోసారి లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార ఎన్డీఏ కూటమి తరఫున గత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను బరిలోకి దిగారు. అటు.. ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కె.సురేష్ నామినేషన్లు వేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే ఎప్పటినుంచో స్పీకర్ పదవి అధికార కూటమి చేపడుతుండగా.. విపక్ష పార్టీలకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ వచ్చిన తర్వాత ఈ సంప్రదాయానికి తెరపడింది.
స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఎలా?
లోక్‌సభ స్పీకర్‌ను ఎన్నుకునేందుకు నిర్ణీతా కాల వ్యవధి అంటూ స్పష్టంగా ఏదీ లేదు. అయితే కొత్త లోక్‌సభ కొలువుదీరిన తర్వాత వీలైనంత త్వరగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను ఎన్నుకోవాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 లో పొందుపరించారు. లోక్‌సభ స్పీకర్‌ను సాధారణ మెజార్టీతోనే ఎన్నుకుంటారు. లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలు.. సీక్రెట్ బ్యాలెట్ పద్దతి ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలైన మొత్తం ఓట్లలో ఏ అభ్యర్థి సగానికి పైగా ఓట్లు పొందుతారో ఆయననే స్పీకర్‌గా ఎన్నికవుతారు.
స్పీకర్ పదవికి ఎవరు అర్హులు?
లోక్‌సభ స్పీకర్ పదవికి పోటీ చేసేందుకు ప్రత్యేక అర్హతలు ఏమీ అవసరం లేదు. లోక్‌సభలో సభ్యుడిగా ఉన్న ఎవరైనా ఈ పదవికి పోటీ పడవచ్చు. అయితే సభలో సీనియారిటీ, నిష్పాక్షికత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని స్పీకర్ అభ్యర్థిగా పార్టీలు నిలబెడతాయి. అనర్హత లేదా అవిశ్వాస ప్రక్రియ ద్వారా మాత్రమే స్పీకర్‌ను ఆ పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94 ప్రకారం.. నోటీసులు ఇచ్చిన 14 రోజుల తర్వాతే స్పీకర్‌పై అనర్హత లేదా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
స్పీకర్ పదవి ఎందుకు కీలకం?
లోకసభ కార్యకలాపాలు సజావుగా సాగడంలో స్పీకర్ కీలక పాత్ర పోషిస్తారు. సభను ఆర్డర్‌లో ఉంచడం, సభా గౌరవాన్ని కాపాడటంతోపాటు సమావేశాల అజెండా, వాయిదా, అవిశ్వాస తీర్మానాలు అనుమతించే బాధ్యత కూడా స్పీకర్‌దే ఉంటుంది. రాజ్యాంగంలోని 10 వ షెడ్యూల్ ప్రకారం సభా నియమాలను ఉల్లంఘించిన ఎంపీలపై చర్యలు తీసుకోవడం, అనర్హత విధించే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. సభా నియమాలకు అనుగుణంగా వాటిని స్పీకర్ అమలు చేయాల్సి ఉంటుంది. స్పీకర్ నిర్ణయాలను ఎవరూ సవాల్ చేయలేరు. లోక్‌సభలో సభ్యుడు లేదా సభ్యురాలు అయినప్పటికీ.. స్పీకర్‌గా వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు సంపూర్ణ మెజార్టీ సాధించిన బీజేపీ.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి మాత్రం మెజార్టీ మార్కుకు 32 స్థానాలు తక్కువ రావడంతో మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఎన్డీఏకు 293 మంది సభ్యులు, విపక్ష ఇండియా కూటమికి 234 మంది ఎంపీల బలం ఉంది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక కీలకంగా మారింది.