మామిడి కాయలను ఫ్యాక్టరీలకు తరలించి టన్నుకు రూ.30 వేలు పొందాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్‌కుమార్ రైతులకు సూచించారు. మామిడి కోతలు ఒక్కసారిగా జరిగినందున తోతాపురి టన్ను ధర రూ.29 వేల నుంచి రూ.24 వేలకు పడిపోవడంపై మామిడి రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఆయన జిల్లాలోని పల్ప్ ఇండస్ట్రీస్ యాజమాన్యాలు, వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యాన శాఖాధికారులతో సమీక్షించారు. తోతాపురి టన్నుకు రూ.30 వేలు ఇవ్వాలని స్పష్టంచేశారు. రైతులు కూడా కోసిన కాయలను ర్యాంపులు, మార్కెట్ యార్డుల్లో కాకుండా పరిశ్రమలకు తరలించి లాభపడాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉద్యాన అధికారి మధుసూదన్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడీ పరమేశ్వరన్, ఫ్యాక్టరీ యాజమాన్యాలు పాల్గొన్నారు.