ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకోసం కుప్పం ముస్తాబవుతోంది. సీఎంగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా మంగళ, బుధవారాల్లో సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించబోతున్నారు. ఈ క్రమంలో అధికారులు కుప్పాన్ని ముస్తాబు చేస్తున్నారు. తొలుత రహదారుల మధ్యనున్న డివైడర్లకు రంగులు వేశారు. సీఎం బస చేయనున్న ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ వద్ద తక్కువ సామర్థం గల ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి.. కొత్తది ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ కార్యాలయాన్ని, ఆర్టీసీ బస్టాండును కలిపే లింక్ రోడ్డు గతుకులమయమైంది. పాడైన ప్రాంతాలలో మరమ్మతులు చేసి, రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. సీఎం చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించనున్న ఆర్టీసీ బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహ పరిసరాల్లో మురుగునీటి కాలువలను శుభ్రం చేయడమే కాక, కొత్త కాలువల నిర్మాణం సాగుతోంది. మున్సిపల్ కార్యాలయం కూడా నడుస్తున్న ఈ పరిసరాలలో చిన్నపాటి చినుకులకే కాలువలు పొంగి రోడ్డుమీదే మురుగు ప్రవహిస్తుంది. గతంలో నేతాజీ రోడ్డుకు అడ్డంగా తవ్వి తాత్కాలిక మరమ్మతులు చేశారు కానీ, తిరిగి కాలువలు నిర్మించకుండా మట్టితో కప్పి వదిలేశారు. ఇప్పుడు సిమెంటు కాలువల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ఆధునికీకరణ, రంగులు వేయడం, సరికొత్త ఫర్నిచర్ మార్చడం వంటి పనులు పూర్తయ్యాయి. భద్రతా ఏర్పాట్లకోసం ఇప్పటికే అదనపు పోలీసు బలగాలు కుప్పం చేరుకున్నాయి. కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ మణికంఠ మూడునాలుగు రోజులుగా తరచూ కుప్పంలో పర్యటిస్తూ సీఎం పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. హంద్రీ-నీవా కుప్పం బ్రాంచి కాలువను చంద్రబాబు పరిశీలనున్నారు. శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి, జల్లిగానిపల్లెల వద్ద సీఎం పరిశీలనకు అవసరమైన భద్రతా పర్యవేక్షణ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతూ టీడీపీ నేతలు స్వాగత ఫ్లెక్సీలు పెడుతున్నారు.