బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన వ్యక్తికి కాకినాడ పోక్సో కోర్టు 15 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.7 వేలు జరిమానా విధించినట్టు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్ తెలిపారు. అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో దళిత బాలికకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కరెళ్ల గణపతి అనే వ్యక్తి మత్తు పానీయాలు ఇచ్చి బలవంతంగా అనుభవించాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. కొద్ది రోజులకే బాలిక గర్భవతి కాగా గుర్తించిన తల్లిదండ్రులు 2018 ఏప్రిల్ 2న గణపతిపై పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఈ కేసును దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. స్పెషల్ కోర్టు ఫర్ స్పీడీ ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ పోక్సో యాక్టు-2012 కాకినాడ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ పితాని శ్రీనివాసరావు ట్రయల్ నిర్వహించి ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించారు. వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో కరెళ్ల గణపతికి శిక్ష విధిస్తూ జడ్జి కె.శ్రీదేవి సోమవారం తీర్పు చెప్పారు. కేసు దర్యాప్తులో కృషి చేసిన అప్పటి ఎస్‌ఐ జి.సురేంద్ర, దర్యాప్తు అధికారి ఎం.వెంకటేశ్వరరావును ఎస్పీ శ్రీధర్ అభినందించారు.